నాలుగేళ్లల్లో ఏం చేసాం- ఎలా ఓట్లడగాలి: ఆనం సంచలనం..!!
మాజీ మంత్రి ..వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. సొంత పార్టీ..సొంత ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన నియోజకవర్గ పరిధిలోని రాపూరుల వాలంటీర్లు..సచివాలయ కన్వీనర్ల సమావేశంలో ఆనం జనం ముందుకు ఎలా వెళ్లాలంటూ అసహనం వ్యక్తం చేసారు. నాలుగేళ్ల పాలనలో ఏం చేసామని ప్రజల దగ్గరకు వెళ్లి ఓట్లు అడగాలని ప్రశ్నించారు. రోడ్ల గుంతలు పూడ్చలేకపోతున్నామని వాపోయారు. కనీసం మట్టి కూడా వేయలేకపోతున్నామంటూ చెప్పుకొచ్చారు.

పెన్షన్లు పాత స్కీం..ఏంటి లాభం
మంచి నీరు అడుగుతుంటే కేంద్ర జలజీవన్ మిషన్ నిధులు ఇస్తుందని సమాధానం చెబుతున్నారని వివరించారు. కేంద్రం నిధులు ఇస్తే మీరెందుకనే ప్రశ్న మొదలవుతుందని పేర్కొన్నారు. నాలుగేళ్ల కాలంలో ఏమైనా ప్రాజెక్టులు కట్టామా.. ఎక్కడైనా రోడ్లు వేశామా.. నిర్మాణాలకు శంకుస్థాపనలు చేసామా అని ఆనం ప్రశ్నించారు.పెన్షన్లు ఇస్తున్నామని వెళితే ఓట్లు వేస్తారా అంటూ నిలదీసారు. పెన్షన్లు గత ప్రభుత్వం కూడా ఇచ్చిందని..అయితే, వారి కంటే ఎక్కువ ఇస్తున్నామని విశ్లేషించారు. స్కీం మాత్రం పాతదే అని వ్యాఖ్యానించారు.

రోడ్లు లేవు..ప్రాజెక్టులు లేవు
పేదలకు ఇళ్లు అని చెప్పాం.. లే అవుట్లు వేశాం..ఇళ్లు కట్టామా అంటూ ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో నీళ్లు ఇస్తామంటూ ఫ్యాన్ కు ఓట్లేయమని అడిగామని..ఇప్పుడు సమాధానం చెప్పుకోలేకపోతున్నామని పేర్కొన్నారు. ఇప్పుడు సమావేశాలు పెట్టి మీతో పాటుగా కొత్తగా మరో ముగ్గురిని పంపిస్తాం..మీరంతా కలిసి వెళ్లండని చెబుత్నారంటూ తాజాగా గడప గడపకు ప్రభుత్వం వర్క్ షాప్ లో తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తావించారు. మీరు టీ తాగండి..వాళ్లకు టీ తాగించండని చెబుతున్నారని ఆనం వ్యాఖ్యానించారు.

ప్రజలు నిలదీస్తున్నారు..ఏం చెప్పాలి
ప్రజలు గ్రామాల్లో రచ్చబండ మీద కూర్చొని అన్ని విషయాలు మాట్లాడుకుంటున్నారని .. మనం ఏం చెప్పాలని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇచ్చి రెండు వేల పెన్షన్ గుంటల రోడ్ల పైన ప్రయాణం చేస్తే మందులకు సరి పోవటం లేదని వాపోతున్నారంటూ ఆనం వివరించారు. రోడ్ల పైన మట్టి కూడా వేసే అవకాశం లేకుండా పోయిందన్నారు. గతంలోనూ ప్రభుత్వం పైన ఆనం ఇటువంటి వ్యాఖ్యలే చేసారు. ఇప్పుడు సీనియర్ నేత ఆనం చేసిన వ్యాఖ్యలు వైసీపీలో కలకలం రేపుతున్నాయి.












Click it and Unblock the Notifications