మీడియా ముందు కన్నీరు పెట్టుకున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే
Sugunamma: వచ్చే ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనడానికి తెలుగుదేశం పార్టీ.. జనసేన, భారతీయ జనతా పార్టీతో కట్టిన కూటమి ప్రభావం సీనియర్లకు టికెట్లు లేకుండా చేస్తోంది. సుదీర్ఘకాలంగా పార్టీకి విధేయులుగా, నిత్యం ప్రజల మధ్య ఉంటూ వచ్చిన నాయకులు పొత్తుల వల్ల సీట్లు, టికెట్లను కోల్పోవాల్సి వస్తోంది.
టీడీపీ, జనసేనకు చెందిన పలువురు సీనియర్ నాయకులు, ఆశావహులు, మాజీ ఎమ్మెల్యేలు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తోన్నారు. శివరామరాజు, ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, కే అప్పల్నాయుడు, యనమల కృష్ణుడు, కేఎస్ జవహర్, జేడీ రాజశేఖర్, పోతిన మహేష్.. వంటి నాయకులు తిరుగుబాటు బాట పట్టారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటోన్నారు.

తాజాగా తిరుపతికి చెందిన టీడీపీ సీనియర్ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు టికెట్ దక్కకపోవడం పట్ల కన్నీరు పెట్టుకున్నారు. ఈ మధ్యాహ్నం ఆమె తిరుపతిలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మీడియా సమక్షంలో ఆమె కన్నీటిని దాచుకోలేకపోయారు.
2019 ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ నిత్యం ప్రజల్లో ఉన్నానని, జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి ఎంతో శ్రమించానని అన్నారు. సొంత ఖర్చులతో పార్టీని, క్యాడర్‌ను బతికించుకున్నానని పేర్కొన్నారు. 2019లో ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి రోజు నుంచే ప్రజల కోసం పని చేశానని, అయినా ఇలాంటి రోజు వస్తుందని ఊహించలేదని సుగుణమ్మ వ్యాఖ్యానించారు.
ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని, వారికి ఎప్పుడూ అండగా ఉండాలనే సంకల్పంతో ఇన్ని సంవత్సరాల పాటు నిరుత్సాహ పడకుండా పని చేశానని పేర్కొన్నారు. టికెట్ రాకపోయినప్పటికీ తాను ప్రజలకు సేవ చేయడాన్ని మానుకోబోనని ఆమె తేల్చి చెప్పారు. ప్రజలకు ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినప్పటికీ.. అందుబాటులో ఉంటానని అన్నారు.

సుగుణమ్మ భర్త, దివంగత ఎమ్మెల్యే వెంకటరమణ సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలో కొనసాగిన విషయం తెలిసిందే. 2004, 2014లో ఆయన తిరుపతి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. 2015లో తిరుపతి అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికలో సుగుణమ్మ విజయం సాధించారు.
2019లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో ఆమెకు టికెట్ దక్కలేదు. పొత్తులో భాగంగా ఈ సీటును జనసేన దక్కించుకుంది. జనసేన అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులు ఇక్కడి నుంచి పోటీ చేస్తోన్నారు.












Click it and Unblock the Notifications