పవన్ ఔదార్యం: టీడీపీ సీనియర్ నేతకు జనసేన టికెట్ ఖరార్
Nimmaka Jaya Krishna: తెలుగుదేశం పార్టీలో టికెట్ దక్కని నాయకులంతా దాని మిత్రపక్షం జనసేనలో చేరుతున్నారు. జనసేన అభ్యర్థులగా ఈ ఎన్నికల బరిలో దిగుతున్నారు. సుదీర్ఘకాలంగా జనసేన పార్టీలో పని చేస్తూ వస్తోన్న సీనియర్లను కాదని టీడీపీ నుంచి వలస వచ్చిన వారికి టికెట్ ఇస్తూ తన ఔదర్యాన్ని చాటుకుంటోన్నారు పవన్ కల్యాణ్.
ఈ వ్యవహారాన్ని భరించలేక ఇప్పటికే పలువురు సీనియర్ నాయకులకు జనసేనకు గుడ్‌బై చెప్పినప్పటికీ.. పవన్ కల్యాణ్ మాత్రం తన వైఖరిని మార్చుకోవట్లేదు. పార్టీ పెట్టినప్పటి నుంచీ జనసేనలో కొనసాగుతూ వచ్చిన సీనియర్లు పితాని బాలకృష్ణ, పోతిన మహేష్ వంటి వారిని కాదని.. టీడీపీలో టికెట్ దక్కని వారిని అక్కున చేర్చుకుని మరీ ఎన్నికల్లో పోటీకి దించుతోన్నారు జనసేనాని.

ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కకపోవడం వల్ల మండలి బుద్ధప్రసాద్, నిమ్మక జయకృష్ణ.. మొన్నటికి మొన్న తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. టీడీపీకి రాజీనామా చేసిన మరుక్షణమే వారిద్దరూ పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. ఇప్పుడు ఈ పార్టీ నుంచి టికెట్లను ఖరారు చేసుకున్నారు.
మండలి బుద్ధ ప్రసాద్‌కు ఇదివరకే అవనిగడ్డను కేటాయించారు పవన్ కల్యాణ్. ఇప్పుడు తాజాగా నిమ్మక జయకృష్ణకు టికెట్ లభించింది. తాను కోరుకున్న విధంగానే పార్వతీపురం మన్యం జిల్లాలోని పాలకొండ అసెంబ్లీ బరిలో జనసేన తరఫున పోటీ చేస్తోన్నారు నిమ్మక. ఆయన అభ్యర్థిత్వాన్ని పవన్ కల్యాణ్ ఖరారు చేశారు. నిమ్మక జయకృష్ణకు పాలకొండ టికెట్ ఇచ్చినట్లు ప్రకటించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
ఇదే పాలకొండ నియోజకవర్గం నుంచి 2014, 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు నిమ్మక. ఈ రెండుసార్లు కూడా వైఎస్ఆర్సీపీ జెండా ఎగిరిందిక్కడ. ఆ పార్టీ అభ్యర్థి విశ్వసరాయి కళావతి చేతిలో ఓటమి చవి చూశారు. ఇప్పుడు కూడా పాలకొండ నుంచి వైసీపీ అభ్యర్థిగా కళావతి పోటీ చేస్తోన్నారు. మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్నారు నిమ్మక జయకృష్ణ.












Click it and Unblock the Notifications