జగన్ కేసుల్లో మరో కీలక పరిణామం- ఈడీకి చంద్రబాబు అనుమతి..!
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) నిందితుడిగా ఉన్న వాన్ పిక్ కేసులో ఇవాళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఐఏఎస్ బ్రహ్మానందరెడ్డిని ప్రాసిక్యూషన్ చేసేందుకు ఏపీ ప్రభుత్వం (AP Govt) అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. వాన్పిక్ కేసులో అప్పటి ప్రత్యేక కార్యదర్శి కేవీ బ్రహ్మానందరెడ్డిపై మనీలాండరింగ్ కేసులో ప్రాసిక్యూషన్కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ప్రభుత్వం జీవో ఎంఎస్ నంబర్ 221 ఇచ్చింది.
వాన్ పిక్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై ఐఏఎస్ బ్రహ్మానందరెడ్డిని విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఈడీ చేసిన అభ్యర్ధన మేరకు ప్రభుత్వం ఈ అనుమతి ఇచ్చింది. వాన్పిక్ గ్రూప్ కంపెనీలకు అనుచిత ప్రయోజనాలు కల్పించారంటూ బ్రహ్మానందరెడ్డిపై ఈడీ ఆరోపణలు చేస్తోంది. అప్పటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేసిన బ్రహ్మానందరెడ్డి.. వైఎస్ జగన్, ఇతరులతో కలిసి కుట్రకు పాల్పడి వాన్పిక్ కంపెనీలకు ప్రయోజనాలు కల్పించారనేది ఈడీ అభియోగం. చట్ట, ఆర్థిక శాఖల అభిప్రాయాలను పక్కనపెట్టి, తప్పుదారి పట్టించే ప్రతిపాదనలతో వాన్ పిక్ కు కేబినెట్ ఆమోదం ఇచ్చేందుకు సహకరించారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి.

వాన్పిక్ గ్రూప్కు భూముల అధిక కేటాయింపునకు, ప్రభుత్వానికి ఆర్థిక నష్టం కలిగించేందుకు వీలు కల్పించారని ఈడీ అభియోగం. దీంతో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA), 2002లోని సెక్షన్ 3 కింద సెక్షన్ 4 కింద శిక్షార్హమైన నేరంగా ఈడీ పేర్కొంది. హైదరాబాద్లోని సీబీఐ కేసుల ప్రత్యేక కోర్టులో ఇప్పటికే ఈ మేరకు ప్రాసిక్యూషన్ ఫిర్యాదు దాఖలు చేసింది. దీనికి స్పందనగా సీఆర్పీసీ సెక్షన్ 197(1) కింద ఐఏఎస్ బ్రహ్మానందరెడ్డి ప్రాసిక్యూషన్కు అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే హైదరాబాద్ సీబీఐ కోర్టులో ఈడీ కేసుల్ని కూడా రోజువారీ విచారణకు న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్న తరుణంలో తాజా పరిణామాలు ఎటు దారి తీస్తాయోనన్న ఆందోళన వైసీపీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.












Click it and Unblock the Notifications
