స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డుల్లో కీలక మార్పు..! ఇకపై కొత్త డీడీవోలుగా వీరే..!
ఏపీలో వైసీపీ హయాంలో అమల్లోకి వచ్చిన సచివాలయ వ్యవస్ధలో కూటమి ప్రభుత్వం (AP Govt) ఇంకా మార్పులు చేస్తూనే ఉంది. ఇప్పటికే సచివాలయాల పేర్లను స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డులుగా మార్చేసిన ప్రభుత్వం, కొంత మంది ఉద్యోగుల్ని హేతుబద్ధీకరణల పేరుతో వివిధ శాఖలకు పంపింది. అలాగే స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డుల విధుల్లోనూ మార్పులు చేసింది. ఇదే క్రమంలో ఇప్పుడు మరో నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
ఏపీ ప్రభుత్వం స్వర్ణ గ్రామాలు, స్వర్ణ వార్డుల పరిపాలనలో కీలక మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మండల స్థాయిలో మండల స్వర్ణ గ్రామం అధికారులు, పట్టణ స్థాయిలో అర్బన్ స్వర్ణ వార్డు అధికారులు తమ పరిధిలోని స్వర్ణ గ్రామాలు, స్వర్ణ వార్డులకు డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్లు (DDOs)గా వ్యవహరించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, పట్టణాలు, నగరాల్లో మున్సిపల్ కమిషనర్లు డీడీవోలుగా వ్యవహరిస్తున్నారు. వీరి స్ధానంలో స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామ అధికారులకే ఆ బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు శాఖ జీఓ జారీ చేసింది.

స్వర్ణ గ్రామాలు, స్వర్ణ వార్డుల పనితీరును మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం జిల్లా, మండల, పట్టణ స్థాయిల్లో మూడు అంచెల పరిపాలనా వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ వ్యవస్థను బలోపేతం చేసేందుకు మొత్తం 2,778 పోస్టులను మంజూరు చేసింది.అయితే రాష్ట్రంలో ప్రస్తుతం 11,080 స్వర్ణ గ్రామాలకు 9,943 మంది పంచాయతీ కార్యదర్శులు డీడీఓలుగా వ్యవహరిస్తున్నారు. అలాగే 3,924 స్వర్ణ వార్డులకు 123 మంది మున్సిపల్ కమిషనర్లు డీడీఓలుగా ఉన్నారు. ఇంత పెద్ద సంఖ్యలో కార్యాలయాలకు పరిమిత సంఖ్యలో అధికారులు డీడీఓలుగా వ్యవహరించడం వల్ల నియంత్రణ, విధుల నిర్వహణ, నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం వంటి సమస్యలు ఎదురవుతున్నాయని స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు శాఖ డైరెక్టర్ ప్రభుత్వానికి వివరించారు.
ఈ సమస్యలను పరిష్కరించేందుకు మండల స్థాయిలో మండల స్వర్ణ గ్రామం అధికారులను, పట్టణ స్థాయిలో అర్బన్ స్వర్ణ వార్డు అధికారులను వారి పరిధిలోని కార్యాలయాలకు డీడీఓలుగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మార్పుతో పరిపాలనా నియంత్రణ, పర్యవేక్షణ, సమన్వయం మెరుగుపడటంతో పాటు స్వర్ణ గ్రామాలు, స్వర్ణ వార్డుల కార్యకలాపాలు మరింత సమర్థవంతంగా సాగుతాయని ప్రభుత్వం భావిస్తోంది.














Click it and Unblock the Notifications
