మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్..: ఇరాన్ పై మోస్ట్ పవర్ ఫుల్ ఆయుధాన్ని రెడీ చేసిన అమెరికా
పశ్చిమాసియాలో రోజురోజుకూ పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకోవడానికి సిద్ధపడుతోంది. ఇరాన్ వ్యూహాత్మక ప్రదేశాలపై విరుచుకుపడటానికి నూతన ప్రణాళికలను రూపకల్పన చేస్తోంది. ఇరాన్‌లోని అణు, ఇంధన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని తమ వద్ద ఉన్న అత్యంత శక్తివంతమైన మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ (MOAB)ను ఉపయోగించే ప్రతిపాదనను పెంటగాన్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి ఆదేశాలు వెలువడితే ఈ దాడులను కార్యరూపంలోకి తెచ్చేలా వైట్‌హౌస్.. మిలిటరీ అధికారులు ముందస్తు సన్నాహాలు చేశారు కూడా. పిక్ యాక్స్ పర్వత ప్రాంతంలో భూగర్భంలో ఉన్నట్లు భావిస్తున్న ఇరాన్ అణు స్థావరాలపై ఈ వినాశకర బాంబులను ప్రయోగించే అవకాశం ఉందని సీఎన్ఎన్ తెలిపింది. అత్యంత విధ్వంసకరమైన జీబీయూ-43/బీ రకానికి చెందిన బాంబు ఇది. అణ్వేతర ఆయుధం ఇది. నాన్ న్యూక్లియర్ కేటగిరీలో మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ గా పిలుస్తారు దీన్ని.

ఈ ఆయుధం ఇరాన్ అణు కేంద్రాలను ఎంతవరకు నాశనం చేయగలదనే అంశంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణ ఆయుధాలతో పోల్చుకుంటే ఈ బాంబు ప్రయోగం పూర్తిగా భిన్నం. భూ ఉపరితలానికి కొద్ది ఎత్తులో దీన్ని పేల్చుతారు. ఆ వెంటనే అత్యంత శక్తివంతమైన విస్ఫోటన తరంగాలు దీని నుంచి వెలువడతాయి. నేలపైన ఉండే లక్ష్యాలను ధ్వంసం చేయడానికి ఇది అత్యంత అనుకూలం.
పిక్ యాక్స్ పర్వతాల కింద గ్రానైట్ రాతి పొరలను ఛేదించి, లోతుగా ఉన్న బంకర్లను ధ్వంసం చేసే సామర్థ్యం దీనికి పరిమితంగానే ఉందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. పెంటగాన్ అంచనా ప్రకారం ఈ బాంబు ప్రయోగం ప్రధానంగా శత్రుదేశంపై ఒత్తిడిని పెంచడానికి, వారి ప్రధాన స్థావరాలను ధ్వంసం చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. భూగర్భ స్థావరాలపై ఇది పూర్తిస్థాయి ప్రభావం చూపడం కష్టమేనని సీఎన్ఎన్ అంచనా వేసింది.
దాదాపు 21,000 పౌండ్ల బరువు ఉండే ఈ జీబీయూ-43/బీ బాంబును 2000ల ప్రారంభంలో అమెరికా రక్షణ శాఖ అభివృద్ధి చేసింది. మొదటిసారిగా ఏప్రిల్ 2017లో ఉపయోగించింది. డొనాల్డ్ ట్రంప్ తన మొదటి అధ్యక్ష పదవీ కాలంలో అఫ్గానిస్తాన్‌లోని ఐసిస్ ఉగ్రవాదుల భూగర్భ సొరంగ మార్గాలపై ఈ బాంబును ప్రయోగించారు. ఆ నాటి దాడిలో సుమారు 36 మంది ఉగ్రవాదులు హతమైనట్లు అఫ్ఘనిస్తాన్ అధికారికంగా ప్రకటించింది.
ఈ బాంబు భూమిలోకి చొచ్చుకెళ్లి అక్కడ ఉన్న లక్ష్యాలను నేరుగా ధ్వంసం చేసే విధంగా రూపొందించినది కాదు. జనవాసాలకు సమీపంలో ఉండే సైనిక మౌలిక సదుపాయాలపై ఈ బాంబును ప్రయోగిస్తే పెద్ద సంఖ్యలో సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందనే ఆందోళన లేకపోలేదు. ఈ పిక్ యాక్స్ మౌంటెన్ వంటి పర్వతాల లోతులు, మందపాటి రాతి పొరల కింద ఉన్న భూగర్భ అణు కేంద్రాలను ధ్వంసం చేయడంలో ఈ మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ ఎంతవరకు ప్రభావం చూపగలదనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది.













Click it and Unblock the Notifications
