కూలిన పాఠశాల పైకప్పు.. 32 మంది చిన్నారులు మృతి.. మరికొందరికి గాయాలు..
పాకిస్థాన్ లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ రాజధాని పెషావర్ లో తీవ్ర విషాదం నెలకొంది. నగరంలోని దిర్ కాలనీలో ఉన్న ఆల్ ఖైర్ పబ్లిక్ స్కూల్ లో పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో 32 మంది విద్యార్థులు, ఓ ఉపాధ్యాయురాలు ప్రాణాలు కోల్పోయారు. మరో డజన్ల మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గురువారం తెల్లవారుజామున ఈ విషాద ఘటన జరిగింది. అంతకుముందు రోజు రాత్రి పేషావర్ లో కురిసిన భీకర వర్షం కారణంగా తెల్లవారుజామున పైకప్పు ఒక్కసారిగా కూలింది. ఇక ఈ ఘటనాస్థలిలో చిన్నారుల ఆర్తనాదాలు, తల్లిదండ్రుల రోదనలతో ఆ ప్రాంతమంతా శోకసంద్రంగా మారింది.
మృతి చెందిన చిన్నారులంతా ఆరేళ్ల నుంచి 14 ఏళ్ల వయసు మధ్యలోనే ఉన్నారని పేషావర్ లోని లేడీ రీడింగ్ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో 25 ఏళ్ల మహిళా టీచర్ కూడా ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధృవీకరించారు. ఇక ఘటనాస్థలిలో ఇంకెంత మంది చిన్నారులు శిథిలాల కింద చిక్కుకున్నారని వారిని వెలికి తీసేందుకు రెస్క్యూ బృందాలు సహాయక చర్యలను ముమ్మరం చేశాయని అహ్మద్ అనే స్థానికుడు తెలిపాడు.
ఆస్పత్రి వైద్యుల సమాచారం ప్రకారం ఈ ఘటనలో దాదాపు 50 మంది వరకు చిన్నారులు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీళ్లంతా చికిత్స పొందుతున్నారని వైద్యులు పేర్కొన్నారు. ఇక పాకిస్థాన్ లోని అనేక ప్రాంతాల్లో భవనాలు కుప్పకూలడం సర్వసాధారణంగా మారిపోయింది. నాసిరకం మెటీరియల్ వాడకం.. పేలవమైన పనితనం కారణంగా ఈ ప్రాంతంలో భవనాలు కుప్పకూలుతున్నట్లు స్పష్టం అవుతోంది.

ఇక ఈ ఘటనపై పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన హృదయవిదారకమైన విషాదం అని పేర్కొన్నారు. అలాగే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. అలాగే మృతి చెందిన చిన్నారుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు స్పష్టం చేశారు. అలాగే ఈ దుర్ఘటనపై పాకిస్థాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ స్పందించారు. ఈ ఘోర ప్రమాదంలో చాలా మంది పిల్లల ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు.












Click it and Unblock the Notifications
