అమరావతికి మరో షాక్-చంద్రబాబు ఆఫర్ కాదని మరీ విశాఖకు ఆర్బీఐ...!
ఏపీలో మూడు రాజధానుల వివాదం కారణంగా ప్రస్తుత రాజధాని అమరావతికి మరో ఎదురుదెబ్బ తగిలింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతిలో ఏర్పాటు చేసేందుకు సిద్ధమైన ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం ఇప్పుడు విశాఖకు తరలిపోతోంది. రాజధాని ఏర్పాటు కాకపోయినా భవిష్యత్ అంచనాలతో అమరావతిలో భూకేటాయింపుల్ని కూడా కాదని విశాఖకు వెళ్లేందుకు ఆర్బీఐ అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది.
గత చంద్రబాబు ప్రభుత్వంలో అమరావతిని రాజధానిగా కేంద్రం గుర్తించాక ఇక్కడ రిజర్వు బ్యాంకు ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుకు సిద్ధమైంది. దీంతో టీడీపీ ప్రభుత్వం ఏకంగా 11 ఎకరాల భూమిని అమరావతిలో కేటాయించింది. ఇందులో ప్రాంతీయ కార్యాలయం మాత్రం ఏర్పాటు కాలేదు. ఆలోపు ప్రభుత్వం మారడం, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం, దాంతో పాటే మూడు రాజధానులు తెరపైకి రావడంతో ఆర్బీఐ డైలమాలో పడింది.

చివరకు వైసీపీ సర్కార్ ప్రతిపాదిస్తున్న భవిష్యత్ రాజధాని విశాఖకు మారేందుకు ఆర్బీఐ సిద్ధమైంది. విశాఖలో తమ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు కోసం భూమి లేదా భవనాలు కేటాయించాలంటూ ప్రభుత్వాన్ని కోరింది. దీంతో విశాఖలో ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు కోసం 30 నుంచి 35 వేల చదరపు అడుగుల భవనాలను గుర్తించాలంటూ ప్రభుత్వం నుంచి జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు అందాయి. ఇప్పుడు ఆ భవనాల అన్వేషణలో అధికారులు బిజీగా ఉన్నారు.












Click it and Unblock the Notifications