ఏపీ హైకోర్టు తరలింపు వ్యవహారం-కేంద్రం కీలక ప్రకటన..!
ఏపీ హైకోర్టు తరలింపు వ్యవహారంపై ఇవాళ పార్లమెంటులో కేంద్రం మరో కీలక ప్రకటన చేసింది. హైకోర్టును కర్నూలుకు తరలిస్తున్నారా అంటూ రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్రం స్పందించింది. హైకోర్టు తరలింపు ఎలా జరుగుతుందో పూర్తి స్పష్టత ఇచ్చింది.
ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం హైకోర్టు అమరావతిలో ఏర్పాటైందని కేంద్రం ఇవాళ పార్లమెంటులో వెల్లడించింది. దీన్ని కర్నూలుకు తరలించేందుకు సీఎం జగన్ ప్రతిపాదించారని కేంద్రం తెలిపింది. అయితే హైకోర్టు తరలించాలంటే మాత్రం రాష్ట్ర ప్రభుత్వంతో పాటు హైకోర్టు కూడా కలిపి ఉమ్మడి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని కేంద్రం తేల్చిచెప్పేసింది. గతంలోనూ కేంద్రం ఈ విషయాన్ని స్పష్టం చేసింది.

మరోవైపు హైకోర్టు కర్నూలుకు తరలించేందుకు జగన్ చేసిన ప్రతిపాదనలపై ముందుకు వెళ్లేందుకు సుప్రీంకోర్టులో పెండింగ్ కేసులు అడ్డంకిగా ఉన్నట్లు కేంద్రం తెలిపింది. వాస్తవానికి ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రాజధానుల్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయని, అమరావతి, పరిసర ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాలని హైకోర్టుతీర్పు ఇచ్చిందని కేంద్రం గుర్తుచేసింది. మూడురాజధానులపై సుప్రీంకోర్టులో పెండింగ్ కేసులున్నాయని, విభజన చట్టంపై హైకోర్టు కూడా తీర్పు ఇచ్చిందని కేంద్రం పేర్కొంది. ఇలాంటి తరుణంలో కేంద్రం చేయాల్సిందేమీ లేదని చెప్పకనే చెప్పేసింది.












Click it and Unblock the Notifications