చిక్కుల్లో ఎమ్మెల్యే రాపాక.. ! దొంగ ఓట్ల కామెంట్స్ పై విచారణకు సీఈవో ఆదేశం..!
2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున రాజోలు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రాపాక వరప్రసాదరావుకు ఎన్నికల ప్రధానాధికారి షాకిచ్చారు. ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలపై దాఖలైన ఫిర్యాదుపై స్పందించిన సీఈవో ఆయనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కోనసీమ జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. దీంతో రాపాక చిక్కుల్లో పడ్డారు. ఈ నేపథ్యంలో రాపాక గతంలో చేసిన దొంగనోట్ల వ్యాఖ్యలు మరోసారి తెరపైకి వచ్చాయి.
రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ గతంలో తాను దొంగ ఓట్లు వేయించుకుని ఎలా గెలిచే వాడినో బయటపెట్టారు. తన నియోజకవర్గంలో నిర్వహించిన ఓ బహిరంగసభలో మాట్లాడుతూ రాపాక తన దొంగ ఓట్ల బాగోతాన్ని నేతలకు వివరించారు. తాను ఏ ఎన్నికల్లో ఇలా గెలిచారో నిర్దిష్టంగా చెప్పకపోయినా దొంగ ఓట్లతో ఎలా గెలిచానో మాత్రం క్లారిటీ ఇచ్చేశారు. దీనిపై అప్పట్లోనే తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే ప్రస్తుతం అధికార పార్టీతో అంటకాగుతున్న ఆయనపై కేసులు నమోదు కాలేదు.

ఈ నేపథ్యంలో రాజోలు నియోజకవర్గానికి చెందిన వెంకటపతిరాజు అనే వ్యక్తి ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశారు. రాపాక చేసిన వ్యాఖ్యలను ఈ మెయిల్ రూపంలో ఆధారాలతో సహా సీఈవోకు పంపారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎమ్మెల్యేగా ఎన్నికైన రాపాక.. దొంగనోట్లతో తాను గెలిచినట్లు చెప్పడాన్ని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై వెంటనే విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని ఆయన సీఈవోను కోరారు. దీనిపై సీఈవో స్పందించారు.
ఎమ్మెల్యే రాపాకపై వచ్చిన ఆరోపణలపై ఎన్నికల ప్రధానాధికారి ఇవాళ స్పందించారు. జనసేన రెబల్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావుపై విచారణకు ఎన్నికల కమిషన్ తరఫున విచారణకు ఆదేశాలు ఇచ్చారు. ఓ పబ్లిక్ మీటింగ్లో దొంగ ఓట్లతో గెలిచానంటూ రాపాక వరప్రసాదరావు చేసిన వ్యాఖ్యలపై విచారణ జరిపి వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు పంపారు. దీంతో ఇప్పుడు కలెక్టర్ విచారణ జరిపేందుకు సిద్ధమవుతున్నారు.












Click it and Unblock the Notifications