ఏపీకి వర్షసూచన- ఓ మోస్తరు నుంచి..
Bay of Bengal: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన వాతావరణం వల్ల ఏపీలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఉత్తరాంధ్ర సహా, ఏపీ దక్షిణ తీర ప్రాంత జిల్లాలు, రాయలసీమలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.
బంగాళాఖాతం ఉత్తర ప్రాంతానికి ఆనుకుని బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది బలపడి అల్పపీడనంగా మారింది. దీని ప్రభావంతో కొద్దిరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఓ మోస్తరుగా వర్షాలు పడుతున్నాయి. చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షపాతం నమోదవుతోంది.

ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కర్నూలు, తిరుపతి, అన్నమయ్య రాయచోటి జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తారు వర్షాలు కురిశాయి.
నేడు కూడా ఇదే పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా కనిపించే అవకాశాలు ఉన్నాయి. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో ఓ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి.
వీటితో పాటు అన్నమయ్య రాయచోటి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ చెదురుమదురుగా వర్షపాతం నమోదు కావొచ్చు. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. బలమైన ఈదురుగాలులు వీచే సమయంలో ప్రజలు హోర్డింగులు, చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు వంటి ప్రదేశాల వద్ద నిల్చోకూడదని విజ్ఞప్తి చేసింది.












Click it and Unblock the Notifications