కిరణ్ జైలుకెళ్లడం: శంకరన్న, పాశుపతం: దామోదర
హైదరాబాద్/ నల్లగొండ: విచాణర జరిగితే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని మాజీ మంత్రి, కాంగ్రెసు తెలంగాణ ప్రాంత సీనియర్ శాసనసభ్యుడు పి. శంకరరావు అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అవినీతితో అక్రమాస్తులు కూడబెట్టారని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
కిరణ్ ముఖ్యమంత్రి కాక ముందు అయిన తర్వాత ఉన్న ఆస్తులపై విచారణ జరపాలని సిబిఐకి లేఖ రాయనున్నట్లు మాజీ మంత్రి శంకర్రావు తెలిపారు. తనను మంత్రి పదవి నుంచి తొలగించినాటి నుంచి శంకరరావు ముఖ్యమంత్రిపై విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే.

తెలంగాణను అడ్డుకోవడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వద్ద బ్రహ్మాస్త్రం ఉంటే దాన్ని తిప్పికొట్టడానికి తెలంగాణ ప్రజల పాశుపతాస్త్రం ఉందని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ వ్యాఖ్యానించారు. ఆయన సోమవారం నల్లగొండలో మాట్లాడారు. ఎవరెన్ని ఆటంకాలు కలిగించినా తెలంగాణ ఆగదని ఆయన అన్నారు.
కుట్రలూ కుతంత్రాలకు కిరణ్ కుమార్ రెడ్డి పర్యాయపదమని ఆయన వ్యాఖ్యానించారు. కిరణ్ కుమార్ రెడ్డి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాజకీయ లబ్ధి కోసమే తెలంగాణను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications