టిలో పరువు: గ్రేటర్‌లో షర్మిలను దించనున్న జగన్
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల త్వరలో ఐదు రోజుల పాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి దాదాపు తెలంగాణను వదిలేసుకున్నారనే చెప్పవచ్చు. సీమాంధ్ర పైనే ఆయన ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు.
అయితే, ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో తెలంగాణలో పార్టీని నిలబెట్టాలని ఆయన భావిస్తున్నారు. ఇందుకోసం ఏ అవకాశాన్ని వదులుకోవద్దని ఆయన భావిస్తున్నారు. అదే సమయంలో తెలంగాణలో చాలామంది వైయస్ రాజశేఖర రెడ్డి అభిమానులు ఉన్నారు. వారు జగన్ వెంటే ఉంటున్నారు. ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో ప్రచారం చేయాలని ఆ ప్రాంత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు జగన్ పైన ఒత్తిడి తెస్తున్నారు.

నాయకుల ఒత్తిడి, తెలంగాణపై భవిష్యత్తు యోచన దృష్ట్యా జగన్ కూడా తెలంగాణలో తమ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయించేందుకు సిద్ధమయ్యారు. సీమాంధ్రపై దృష్టి సారించిన జగన్.. తన సోదరి షర్మిలచే తెలంగాణలో ప్రచారం చేయించేందుకు సిద్ధమయ్యారట. ఈ నెల 30వ తేదీన తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. జగన్ పార్టీకి హైదరాబాద్, చుట్టుపక్కల జిల్లాలతో పాటు ఖమ్మం జిల్లాలో కొంత పట్టు ఉంది.
దీంతో గ్రేటర్ హైదరాబాదు పరిధిలో ఐదు రోజుల పాటు షర్మిలచే ప్రచారం చేయించాలని నిర్ణయించుకున్నారట. తమకు అనుకూలంగా ఉన్న జిల్లాల్లో సాధ్యమైనన్ని సీట్లు గెలుచుకుంటే.. భవిష్యత్తులో మరిన్ని మంచి ఫలితాలు సాధిస్తామని ఆ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా హైదరాబాదు పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉండనుంది.
ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాదు పైన జగన్ కొంత దృష్టి పెట్టారంటున్నారు. రాజధానిలో నిలబడితే... ఆ తర్వాత క్రమంగా తెలంగాణలో భవిష్యత్తులో బలం పుంజుకోవచ్చునని ఆ పార్టీ యోచనగా ఉందంటున్నారు. అంతేకాకుండా తెలంగాణలో కనీస సీట్లు గెలవకుంటే అది పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందని, ఉన్న క్యాడర్ కూడా గోడ దూకేస్తుందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పరువు కోసమైనా కొన్ని సీట్లనైనా పార్టీ గెలుచుకోవాల్సి ఉంటుందంటున్నారు.












Click it and Unblock the Notifications