భువనేశ్వరికి దండం, ఆ బాధ ఎవరికీ చెప్పలేదు: షర్మిల, దిష్టితీసిన రోజా
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరికి దండం పెట్టాలని, స్వర్గీయ నందమూరి తారక రామారావు ఫోటో చూసినప్పుడల్లా ఆమె పడే వేదన ఎవరికీ చెప్పుకోలేదని వైసిపి నాయకురాలు షర్మిల అన్నారు.
అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరికి దండం పెట్టాలని, స్వర్గీయ నందమూరి తారక రామారావు ఫోటో చూసినప్పుడల్లా ఆమె పడే వేదన ఎవరికీ చెప్పుకోలేదని వైసిపి నాయకురాలు షర్మిల అన్నారు.
చదవండి: చంద్రబాబు దుమ్మదులిపిన షర్మిల
నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా నిర్వహించిన ప్లీనరీలో రెండో రోజు ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
చంద్రబాబు భార్య భువనేశ్వరికి దండం పెట్టాలని షర్మిల వ్యాఖ్యానించారు. జన్మను ఇచ్చిన తండ్రి ఎన్టీఆర్‌కు తన భర్త వెన్నుపోటు పొడిచినా, తన తండ్రి మరణానికి ఆయన కారణమైనా, ఆమె తన మాంగల్యం చూసుకొని బతికేస్తుందన్నారు.

ఆ బాధ ఎవరికీ చెప్పుకోలేదు
ఎన్టీఆర్ పటానికి దండం పెట్టిన ప్రతిసారి, ఆయన కళ్లలోకి చూసే ప్రతిసారి, ఆ తల్లి మనసులో పడే వేదన ఎవరికి చెప్పుకోగలదని వ్యాఖ్యానించారు. చంద్రబాబువి ఎప్పడూ వెన్నుపోటు రాజకీయాలే అన్నారు.

షర్మిల, జగన్‌పై అక్షింతలు వేయించిన రోజా
వెల్లువలా తరలి వచ్చిన అశేషమైన వైసిపి కార్యకర్తలను ఉద్దేశించి షర్మిల చేసిన ప్రసంగానికి ఆద్యంతం సభికుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఆమె ప్రసంగం ముగిసిన వెంటనే, అక్కడే ఉన్న ఎమ్మెల్యే రోజా దిష్టి తీశారు. ఆపై నుదుటన తిలకం దిద్ది, విజయమ్మకు అక్షింతలు ఇచ్చి, జగన్, షర్మిల నెత్తిన వేయించారు.
Recommended Video


చంద్రబాబుపై కక్ష తీర్చుకుంటాం
అంతకుముందు, పార్థసారథి చంద్రబాబుపై మండిపడ్డారు. రాజధాని అమరావతి నిర్మాణాన్ని చంద్రబాబు సింగపూర్ రాబందులకు అప్పగించాడని ధ్వజమెత్తారు. కుట్రలు, హత్యా రాజకీయాలు మినహా ఈ మూడేళ్లలో చంద్రబాబు ఏం చేశారని నిలదీశారు. జగన్ సీఎం అయ్యాక అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటారన్నారు. సుపరిపాలన అందించని చంద్రబాబుపై తాము అధికారంలోకి వచ్చాక కక్ష తీర్చుకుంటామన్నారు.

చంద్రబాబు జేజమ్మ తరం కాదు
ఇసుక దందాతో టిడిపి నేతలు కోట్లు దండుకుంటున్నారని పార్థసారథి అన్నారు. ఆ పాపపు సొమ్ముతో ఓట్లు కొనాలని చంద్రబాబు చూస్తున్నారన్నారు. ఓటుకు రూ.5వేలు ఇవ్వగలనని నంద్యాలలో చంద్రబాబు అన్నారని గుర్తు చేశారు. పార్టీలో చేరిన వారితో రాజీనామా చేయించి, ఎన్నికలకు వెళ్లే దమ్ము ఆయనకు ఉందా అని నిలదీశారు. ఎన్ని కుట్రలు చేసినా వైసిపిని అణగదొక్కలేరన్నారు. జగన్ సిఎం కావడం ఖాయమన్నారు. వైసిపిని లేకుండా చేయడం చంద్రబాబు జేజమ్మ తరం కాదన్నారు.












Click it and Unblock the Notifications