జగన్ పార్టీలా కాదు: శైలజానాథ్, కష్టమే: రేవంత్ రెడ్డి

హైదరాబాద్: సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్ నాయకుడు, రాష్ట్ర మంత్రి శైలజానాథ్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. సీమాంధ్ర కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు రాష్ట్ర సమైక్యానికే కట్టుబడి ఉన్నారని స్పష్టం చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గతంలో ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్ర విభజన చేయాలని కేంద్రాన్ని కోరారని శైలజానాథ్ గుర్తు చేశారు.

సీమాంధ్ర ప్రాంతంలో ప్రజలు ఆందోళన వ్యక్తం చేయడంతో ప్రస్తుతం జగన్ పార్టీ సమైక్యబాట పట్టిందని శైలజానాథ్ అన్నారు. జగన్ పార్టీ ఇప్పుడు సమైక్యం పోరాటం చేస్తే మంచిదేనని, అయితే తమ పార్టీపై అనవసర ఆరోపణలు చేస్తే ఊరుకోమని తేల్చి చెప్పారు. సీమాంధ్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే కోరుకుంటున్నారని శైలజానాథ్ తెలిపారు. సమైక్యం కోసం పోరాడుతున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై వ్యంగ్యమైన ఆరోపణలు చేయడం, చిత్రాలు ప్రచారం చేయడం తగదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు సూచించారు.

Shailajanath

సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు అధిష్టానాన్ని ధిక్కరించి సమైక్య రాష్ట్రం కోసం పోరాటం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రం సమైక్యంగా ఉంచడం కోసం సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు తమ సంతకాలతో కేంద్రానికి లేఖలు పంపించినట్లు గుర్తుంచుకోవాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సూచించారు. రాష్ట్రం సమైక్యం కోసం ప్రణాళికలు ఉండాలే తప్ప విమర్శలు చేసుకోవడానికి కాదని అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారా ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్‌పై ఆరోపణలు చేయడం మంచిదికాదని అన్నారు.

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆదేశాల మేరకు కేంద్రం విభజన ముసాయిదా బిల్లును రాష్ట్ర అసెంబ్లీకి పంపించిందని శైలజానాథ్ తెలిపారు. రాష్ట్రపతి బిల్లుపై గడువు ఇచ్చినందు వల్ల బిల్లుపై చర్చ జరగాల్సిందేనని ఆయన అన్నారు. బిల్లులోని ప్రతీ క్లాజుపై చర్చ జరిగేలా చూస్తామని ఆయన అన్నారు. అసెంబ్లీ తన కార్యక్రమాలను నిర్వహిస్తుందని చెప్పారు. రాష్ట్ర ఐక్యత కోసం రాజకీయ ప్రయోజనాలు పక్కనపెట్టి అందరూ కలిసి రావాలని ఆయన కోరారు. ప్రజల ఆకాంక్షలను, ఐక్యతను కాపాడాలే కాని అనవసర ఆరోపణలు చేయడం మానుకోవాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సూచించారు.

గవర్నర్‌కు అధికారాలు ఎక్కడా లేవు: గాదె

రాజ్యాంగాన్ని పక్కనబెట్టి విభజన చేస్తే తాము అంగీకరించబోమని కాంగ్రెస్ సీనియర్ నేత గాదె వెంకటరెడ్డి అన్నారు. ఉమ్మడి రాజధాని, గవర్నర్‌కు అధికారులు దేశంలో ఎక్కడా లేవని ఆయన అన్నారు. విభజన జరగాలంటే అసెంబ్లీ అభిప్రాయం అవసరమని ఆయన అన్నారు. 371డి సవరణ లేకుండా విభజన సాధ్యం కాదని గాదె వెంకటరెడ్డి చెప్పారు.

బిల్లుపై సభలో చర్చ జరగడం కష్టం: రేవంత్

రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లుపై శాసనసభలో చర్చ జరగడం కష్టమని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు జరిగిన సమావేశాలను క్రోడీకరించి స్పీకర్ నాదెండ్ల మనోహర్ మూడు రోజుల్లోగా రాష్ట్రపతికి నివేదిక పంపాలని ఆయన సూచించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సీమాంధ్ర ప్రాంత పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

రాష్ట్ర విభజనకు అసెంబ్లీలో తీర్మానం అవసరమని తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర ప్రాంత నేత యనమల రామకృష్ణుడు అన్నారు. అసెంబ్లీలో ముసాయిదా బిల్లుపై చర్చ జరగాలని అన్నారు. హైదరాబాద్, ఆంధ్రా రాష్ట్రాల విలీన సమయంలో రెండు చోట్ల తీర్మానాలు చేశారని ఆయన అన్నారు. ముసాయిదా బిల్లుపై అసెంబ్లీలో చర్చించే ముందే సమైక్యరాష్ట్ర తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+