ఫ్యామిలీలో చిచ్చు: జగన్‌కు షాకిచ్చిన బుడ్డాకు ఝలక్, వైసిపిలోనే సోదరుడు
కర్నూలు: అధికార టిడిపి, ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు సోదరుల మధ్య విభేదాలు తీసుకు వచ్చాయి! ఏళ్లుగా దాదాపు ఒకే పార్టీలో ఉంటున్న అన్నదమ్ములు ఇప్పుడు హఠాత్తుగా వేర్వేరు పార్టీలలో మిగిలారు. కర్నూలు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి ఇటీవల టిడిపిలో చేరారు.
గత సార్వత్రిక ఎన్నికల్లో ఆయన వైసిపి నుంచి గెలుపొందారు. ఇటీవలే ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా టిడిపిలో చేరారు. అయితే, ఆయన సోదరుడు బుడ్డా శేషా రెడ్డి మాత్రం వైసిపిలోనే ఉండిపోయారు. చాలా ఏళ్ల పాటు ఈ అన్నదమ్ములు ఒకే పార్టీలో ఉన్నారు.
కర్నూలులో వైసిపి అధినేత జగన్ దీక్ష చేస్తున్నారు. ఆయన దీక్ష మూడో రోజుకు చేరుకుంది. ఈ దీక్షకు బుడ్డా శేషా రెడ్డి హాజరయ్యారు. ఇద్దరు సోదరులు వేర్వేరు పార్టీలలో కొనసాగుతుండటం దాదాపు ఇదే మొదటిసారి కావొచ్చు.

దివంగత ఎన్టీఆర్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన బుడ్డా వెంగళరెడ్డి చనిపోయేదాకా టిడిపిలోనే కొనసాగారు. ఆయన హత్యకు గురయ్యారు. ఆ తర్వాత వెంగళ రెడ్డి ముగ్గురు కుమారులు సీతారామి రెడ్డి, రాజశేఖర రెడ్డి, శేషా రెడ్డిలు ఒక్కుమ్మడిగానే ముందుకు సాగారు.
సీతారామి రెడ్డి తన తండ్రి స్థానంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓసారి గెలిచారు. ఆ తర్వాత అనారోగ్యంతో ఆయన చనిపోయాక రాజశేఖర రెడ్డి క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టిడిపిని వీడిన బుడ్డా రాజశేఖర రెడ్డి.. జగన్ పార్టీలో చేరారు.
సోదరుడి వెంటే బుడ్డా శేషారెడ్డి నడిచారు. నాడు వైసిపిలో చేరారు. ఈ క్రమంలో గడచిన ఎన్నికల్లో బుడ్డా రాజశేఖర రెడ్డి శ్రీశైలం నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే, బాబు ఆపరేషన్ ఆకర్ష్ వలలో బుడ్డా రాజశేఖర రెడ్డి పడ్డారు. జగన్‌కు ఝలక్ ఇచ్చి సైకిల్ ఎక్కారు.
అప్పటిదాకా ఒకే బాటలో నడిచిన బుడ్డా సోదరులు.. ఈ కీలక పరిణామంతో విడిపోయారు. రాజశేఖర రెడ్డి టిడిపిలోచేరినా, శేషారెడ్డి మాత్రం సైకిల్ సవారీకి ససేమిరా అన్నారు. మూడు రోజుల క్రితం జగన్ కర్నూలులో చేపట్టిన జలదీక్షకు శేషారెడ్డి హాజరయ్యారు. అంతేకాకుండా వేదికపై ఆయనే సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచారు.












Click it and Unblock the Notifications