ఏపీలో కదులుతున్న రైలులోనే అత్యాచారం.. ఏకంగా మహిళా బోగీలోకే ఎక్కి..
దక్షిణ మధ్య రైల్వే రైలు ప్రయాణాలలో ప్రయాణికులకు భద్రత కల్పించడానికి అనేక చర్యలు చేపడుతుంది. అయినప్పటికీ జరుగుతున్న షాకింగ్ ఘటనలు సభ్య సమాజం నివ్వెరపోయేలా చేస్తున్నాయి. తాజాగా రైలులో ప్రయాణం చేస్తున్న ఒక మహిళను, ఒక వ్యక్తి కత్తితో బెదిరించి అత్యాచారం చేసి, ఆమెను దోపిడీ చేసిన ఘటన ప్రతి ఒక్కరిని షాక్ కి గురి చేసింది.
రైలు ప్రయాణంలో మహిళకు ఊహించని ఘటన
ఏపీలోని గుంటూరు పెద్దకూరపాడు స్టేషన్ల మధ్య రైలులోనే అత్యాచారం చేసిన ఘటన సంచలనంగా మారింది. గుంటూరు రైల్వే స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలలోకి వెళితే.. ఒక మహిళ గుంటూరు నుంచి చర్లపల్లి కి వెళ్లడానికి రైలు ఎక్కింది. రైలు సత్ర గంజ్ నుండి చర్లపల్లి కి వెళుతున్న సమయంలో ఆమెకు ఊహించని అనుభవం ఎదురైంది.

లేడీస్ కోచ్ లో ఒంటరిగా మహిళ, లోనికి ఎక్కిన వ్యక్తి
రాత్రి ఏడు గంటల ఐదు నిమిషాల ప్రాంతంలో రైలు ఆగినప్పుడు ఆమె లేడీస్ కోచ్ లో ఒంటరిగా ఉంది. మహిళా కోచ్ లో ఒంటరిగా కూర్చున్న ఆమెను నల్ల చొక్కా, బూడిద రంగు ప్యాంటు ధరించి బ్యాగు తో పాటు వచ్చిన ఒక 40 ఏళ్ల వయసున్న వ్యక్తి అది లేడీస్ బోగి అని చెబుతున్నప్పటికీ, ఆమె డోర్ లాక్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ, ఆమెను దాన్ని తెరవడానికి ఒప్పించి లోపలికి ఎక్కాడు.
కత్తితో బెదిరించి అత్యాచారం ఆపై దోపిడీ
గుంటూరు పెద్దకూరపాడు స్టేషన్ల మధ్య సదరు వ్యక్తి ఆ మహిళను కత్తితో బెదిరించి ఆమె పైన అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెను శారీరకంగా, లైంగికంగా వేధించాడు. ఆపై ఆమె వద్ద ఉన్న 5,600 రూపాయలను మొబైల్ ఫోన్ ఉన్న ఒక హ్యాండ్ బ్యాగ్ ను దొంగతనం చేశాడు. పెద్దకూరపాడు రైల్వే స్టేషన్ రాగానే దూకి పారిపోయాడు.
రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ
ఇక తన పైన రైలులోనే అత్యాచారం జరిగిందని బాధితురాలు చర్లపల్లి వెళ్ళిన తర్వాత సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నడికుడి పోలీస్ స్టేషన్ కు కేసును బదిలీ చేశారు. ప్రస్తుతం ఈ ఘటన తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది.












Click it and Unblock the Notifications