ఏపీ సర్కార్ కి ఊహించని షాక్ : జాతీయ నివేదికలో నివ్వెరపోయే విషయాలు..
విజయవాడ : రాష్ట్రాభివృద్దే ధ్యేయంగా అడుగులు వేస్తోన్న ఏపీ సర్కార్ కి ఊహించని షాక్ తగిలింది. ప్రభుత్వం అభివృద్ది దిశగా అడుగులు వేస్తోంటే ఆయా శాఖల్లోని అధికారులు మాత్రం రాష్ట్రాన్ని లంచాలకు కేరాఫ్ గా మార్చే అప్రతిష్టను తీసుకొస్తున్నారు.
ఏ రాష్ట్రానికైనా సరే పెట్టుబడులు రావాలంటే అవినీతికి తావు లేని వ్యవస్థ ఉండడం తప్పనిసరి. అలా కానీ పక్షంలో రాష్ట్రాలతో ఒప్పందాలకు కంపెనీలు వెనకాడే పరిస్థితి. ఇది ఆయా రాష్ట్రాల అభివృద్దికి ప్రతికూలం కూడా. ఇక ఇప్పుడిప్పుడే రాజధాని నిర్మాణం దిశగా అడుగులు వేస్తున్న ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు పెట్టుబడులు ఎంతో కీలకం కాబట్టి కంపెనీలకు అనుకూల వాతావరణం కల్పించడం అక్కడి ప్రభుత్వ బాధ్యత.
అయితే వాస్తవ పరిస్థితులు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నట్టు చెబుతోంది 'నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లయిడ్ ఎకనమిక్ రీసెర్చ్' సంస్థ. ఈ సంస్థ తాజాగా వెల్లడించిన ఓ నివేదికలో లంచాలు తీసుకోవడంలో ఏపీ ఏకంగా అగ్ర స్థానంలో ఉండడం గమనార్హం. 74.3 శాతం మంది ప్రజలు ఏపీలో అవినీతి సమస్య తీవ్రంగా ఉన్నట్టు పేర్కొన్నారు. ఇక 74.1 శాతంతో ఏపీ తర్వాతి స్థానంలో తమిళనాడు అవినీతిలో రెండవ స్థానంలో కొనసాగుతోంది.

కాగా, ఇదే సంస్థ వెల్లడించిన మరో నివేదికలో.. పెట్టుబడులకు అనుకూలంగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీకి టాప్ 5 లోను చోటు దక్కలేదు. దీనికి కారణం రాష్ట్రంలో పేరుకుపోయిన అవినీతే అన్న వాదన వినిపిస్తోంది. . లంచావతారులు ఇలాగే రెచ్చిపోతే భవిష్యత్తులో ఏపీకి పెట్టుబడుల విషయంలో ఇది మరింత ప్రతిబంధకంగా మారే అవకాశం ఉంది.
ఇకపోతే పెట్టుబడులను ఆకర్షించడంలో ఢిల్లీ టాప్ లో ఉండగా ఆ తర్వాతి స్థానాల్లో గుజరాత్, తమిళనాడు, ఉన్నాయి. జార్ఖండ్, బీహార్ వంటి రాష్ట్రాలు పెట్టుబడుల విషయంలో అట్టడుగుకే పరిమితమైపోయాయి. అలాగే భూసేకరణ పర్యావరణ అనుమతులకు సంబంధించి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పరిస్థితి చాలా తీవ్రంగా ఉన్నట్టు నివేదిక వెల్లడించింది.












Click it and Unblock the Notifications