• search
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

షాకింగ్:ఆ ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ కలసి పోటీచేస్తున్నాయి...ఎక్కడంటే?

By Suvarnaraju
|

విజయవాడ:ఎపిలో అధికార పార్టీ టిడిపి...ప్రతిపక్ష పార్టీ వైసిపి...ఈ రెండు పార్టీల మధ్య వైరం ఏ స్థాయిలో ఉంటుందో తెలుగునాట తెలియని వ్యక్తి ఎవరూ ఉండరు...వైకాపా ఆవిర్భావం నుంచి నేటివరకు ఈ ఇరుపార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందనడంలో అతిశయోక్తి లేదు.

అయితే రాజకీయంగా ఎల్లప్పుడూ కత్తులు దూసుకునే ఈ రెండు పార్టీలు ఇప్పుడు ఒక ఒరలో ఇమిడిపోబోతున్నాయంటే నమ్ముతారా?...మీరు నమ్మినా నమ్మకున్నా ఇది నిజం అంటున్నారు ఆర్టీసీ ఉద్యోగులు...ఈ విషయం ఇటు టిడిపినో అటు వైకాపానో చెప్పాలి గాని మధ్యలో ఆర్టీసీ ఉద్యోగులకు దీంతో ఏం సంబంధం అంటారా? ...ఉంది...వాళ్లకి ఈ రెండు పార్టీలు కలిసి పోటీచేసే విషయానికి సంబంధం ఉంది...అదెలాగంటే?...

యూనియన్లు...వివరాలు

యూనియన్లు...వివరాలు

ఆర్టీసిలో యూనియన్ ఎన్నికలు జరుగతాయన్న సంగతి తెలిసిందే...ఈ యూనియన్లలో ఎన్ఎంయూ, ఈయూతో పాటు కార్మిక పరిషత్, వైఎస్ఆర్‌ ఆర్‌టీసీ అనే మరో రెండు కార్మిక సంఘాలు కూడా ఉన్నాయి. వైఎస్ఆర్‌ ఆర్‌టీసీ అంటే పేరును బట్టే అది వైసిపి అనుబంధ కార్మిక సంఘం అని అర్థంచేసుకోవచ్చు...అయితే కార్మిక పరిషత్ అనే కార్మిక సంఘం టిడిపికి అనుబంధ సంఘం. ఇప్పుడు ఈ రెండు పార్టీలకు చెందిన అనుబంధ ఆర్టీసీ కార్మిక సంఘాలే త్వరలో జరగబోయే యూనియన్ ఎన్నికల్లో కలసి పోటీచేయబోతున్నాయి.

మహాకూటమి...ఏర్పాటు

మహాకూటమి...ఏర్పాటు

ఎపిలో రాజకీయంగా బద్ద శత్రువులైన ఈ రెండు పార్టీలు...కలలో కూడా కలిసేందుకు ఇష్టపడని ఈ రెండు పక్షాలు ఇప్పుడు ఆర్టీసీ యూనియన్ ఎన్నికల్లో కలసి పోటీ చేస్తుండటమే విచిత్రం! ఎపిఎస్ఆర్టీసీ సంస్థ గుర్తింపు ఎన్నికల్లో ఈ వింత పరిణామం చోటుచేసుకోనుంది. ఆర్టీసీ యూనియన్లలో బలమైన ఎన్‌ఎంయూను ఓడించేందుకు గాను ప్రధాన ప్రతిపక్షం ఈయూ ఈ మహాకూటమిని ఏర్పాటు చేసింది.

విభేదాలే...కారణం

విభేదాలే...కారణం

ఈ మహాకూటమిలో స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌తో పాటు తెలుగుదేశం పార్టీకి చెందిన టీఎన్‌టీయూసీ అనుబంధ కార్మిక సంఘం కార్మిక పరిషత్‌, వైసీపీకికి చెందిన వైఎస్ఆర్‌ ట్రేడ్‌ యూనియన్‌ అనుబంధం వైఎస్‌ఆర్‌ ఆర్‌టీసీలు కూడా భాగస్వాములుగా మారాయి. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే...తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా తెలుగునాడు ట్రేడ్‌ యూనియన్‌ కౌన్సిల్‌ (టీఎన్‌టీయూసీ) నుంచి కార్మిక పరిషత్ బహిష్కృతం కావడమే. టీఎన్‌టీయూసీ, కార్మికపరిషత్‌ల నడుమ ఏడాదికాలంగా వివాదాలు నడుస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.

కార్యవర్గం...రద్దు

కార్యవర్గం...రద్దు

టీఎన్‌టీయూసీలో ఎన్‌ఎంయూ కోవర్టులు ఉన్నారని కార్మికపరిషత్‌ వాదిస్తుండగా...పార్టీ విధానాలకు అనుగుణంగా కార్మిక పరిషత్‌ నేతలు వ్యవహరించడం లేదని టీఎన్‌టీయూసీ నేతల ఆరోపణ. ఈ క్రమంలో రవాణా శాఖ మంత్రి నిర్ణయంతో టీఎన్‌టీయూసీ నేతలు కార్మికపరిషత్‌ కార్యవర్గాన్ని రద్దు చేశారు. నూతన కమిటీని ఎన్నిక చేశారు. కానీ, కార్మిక పరిషత్‌ రిజిస్టర్‌ అయి ఉండటం, టీడీపీ అభిమానులు, సానుభూతిపరులు కార్మిక పరిషత్‌ వైపే ఉండటంతో రద్దయిన కార్యవర్గం పోటీలో నిలవాలని నిర్ణయం తీసుకుంది.

టిడిపి శ్రేణుల...సానుభూతి

టిడిపి శ్రేణుల...సానుభూతి

కార్మికపరిషత్‌ నాయకత్వం తెలుగు దేశం పార్టీకి విథేయతగా ఉండటం పట్ల స్థానిక టిడిపి నాయకత్వాలు ఆ సంఘంపై సానుభూతి చూపుతున్నాయి. మరోవైపు పార్టీ తరుపున ఎన్‌ఎంయూకు మద్దతు తెలపాల్సి రావటాన్ని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఎన్‌ఎంయూను రవాణా శాఖ మంత్రి భుజాన కెత్తుకున్న తీరు తెలుగుదేశం పార్టీ నేతలలో అసంతృప్తిని కలిగిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఆర్టీసీలో కార్మిక పరిషత్‌ బలం చాలా తక్కువే. ఆర్టీసీలో బలమైన ట్రేడ్‌ యూనియన్‌ ఉండాలన్న ఆకాంక్ష రవాణా మంత్రి ఆలోచనలో ఉండి ఉంటే ఈ విధానం కరెక్ట్ కాదేమోననేది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ.

అలా...చేయాల్సింది.

అలా...చేయాల్సింది.

టిడిపి అనుబంధ సంఘమైన కార్మిక పరిషత్ కు ఇలాంటి పరిస్థితి రాకుండా ముందుచూపుతో ఎన్‌ఎంయూలో కార్మిక పరిషత్‌ను విలీనం చేయడమో...లేనిపక్షంలో కనీసం మిత్రపక్షంగా బరిలోకి దింపే ప్రయత్నమో చేసి ఉంటే బాగుండేదనేది విశ్లేషణ. అయితే కార్మికపరిషత్‌కు స్థానికంగా పలు రీజియన్లలో కానీ, పలు డిపోలలో కానీ ఎక్కడా అవకాశం ఇవ్వలేమని ఎన్ఎంయూ స్పష్టం చేసినట్లు తెలిసింది. దీంతో కార్మికపరిషత్‌ విధిలేని పరిస్థితుల్లో ఈయూ వైపు మొగ్గు చూపగా, అలాంటి సమయంలోనూ రవాణా మంత్రి సరిగా స్పందించలేదన్నది ఈ సంఘం నేతల అభిప్రాయంగా ఉంది.

అధికారికం...అనధికారికం...

అధికారికం...అనధికారికం...

ఆర్టీసీ కార్మికులకు 19 శాతం ఇంటీరియం రిలీఫ్‌ను మంత్రి ప్రకటించారు. ఇది గుర్తింపు సంఘంగా ఉన్న ఎన్‌ఎంయూకు లాభించే విషయం. స్వతంత్ర సంఘంగా ఉన్న ఎన్‌ఎంయూ గతంలో కాంగ్రెస్‌తో ఎంతో అనుబంధంగా ఉందని, అప్పటి అగ్రనేతలు కూడా ఆ పార్టీతో సంబంధాలు కొనసాగించారని వీరు గుర్తుచేస్తున్నారు. ఎన్‌ఎంయూ ఏ పార్టీ అధికారం ఉంటే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తుందని అలాంటి సంఘాన్ని పూర్తిగా విశ్వసించలేమన్నది ఆర్టీసీలోని టీడీపీ మద్దతుదారుల భావనగా ఉంది. దీంతో ఆ యూనియన్ తరుపున ఎన్నికల ప్రచారంలో కూడా టీడీపీ నేతలు పాల్గోలేకపోతున్నారని తెలిసింది.

వైఎస్ఆర్‌ ఆర్‌టీసీ...ప్రతిపక్షం గానే

వైఎస్ఆర్‌ ఆర్‌టీసీ...ప్రతిపక్షం గానే

ఇక మరోసంఘం వైఎస్ఆర్‌ ఆర్‌టీసీ ఉనికి ఆర్టీసీలో నామమాత్రమేనని చెప్పవచ్చు. కిందటిసారి గుర్తింపు ఎన్నికలలో పాల్గొన్నప్పటికీ ఓట్లను సాధించటంలో బాగా వెనుకబడి ఉంది. తెలుగుదేశం పార్టీ అధికారికంగా మద్దతు ఇస్తున్న ఎన్‌ఎంయూను ఓడించాలంటే ప్రధానప్రతిపక్షంగా ఉన్న ఈయూకు మద్దతు పలకాలని ఆ పార్టీ నిర్ణయించుకుంది. దీంతో ఈయూతో కలిసి నడవాలని వైఎస్ఆర్‌ ఆర్‌టీసీ డిసైడ్ అయింది. ఈ నేపథ్యంలో టిడిపి మద్దతుదారైన కార్మిక సంఘం, వైసిపి అనుబంధ సంఘం ఒకే కూటమిలో భాగస్వాములుగా కలసి పోటీచేయనుండటం రాజకీయంగా దుమారం రేపుతోంది.

కార్మిక పరిషత్...వాదన

కార్మిక పరిషత్...వాదన

ఈ విషయమై ఈ రెండు సంఘాల నేతల వాదనలు ఇలా ఉన్నాయి. కార్మిక పరిషత్‌ ప్రధానకార్యదర్శి వి.వరహాల నాయుడు మాట్లాడుతూ..."మేము ముఖ్యమంత్రి చంద్రబాబుకు విధేయులం. తెలుగుదేశం పార్టీకి అభిమానులం. మమ్మల్ని బహిష్కరించటానికి టీఎన్‌టీయూసీ ఎవరు? విజయాలు సాధించిన తర్వాత మా నాయకుడు చంద్రబాబును కలిసి వివరిస్తాం. వైసీపీతో మేము పొత్తు పెట్టుకున్నామన్న దుష్ప్రచారం చేస్తున్నారు. మేము వైసీపీతో పొత్తు పెట్టుకోవటమేమిటి ? మేము ఎంప్లాయీస్‌ యూనియన్‌ (ఈయూ) తో పొత్తుపెట్టుకున్నాం. గుంటూరు, ఒంగోలు నాన్‌ ఆపరేషన్లతో పాటు కృష్ణా రీజియన్‌లో హెడ్డాఫీసులో మేము పోటీ చేస్తున్నాం"...అని చెప్పారు. ఏదేమైనా ఆర్టీసీకి సంబంధించి ఈ ఎన్నికలు చర్చనీయాంశంగా మారాయి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

మరిన్ని andhra pradesh వార్తలుView All

English summary
It is sensational that the TDP YCP affiliate associations will compete together in the forthcoming RTC's Union elections.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more