ఎస్ఐ సిద్ధయ్య: పెళ్లి రోజే ప్రాణాలు కోల్పోయాడు
హైదరాబాద్: నల్గొండ జిల్లాలో ఉగ్రవాదులతో పోరాడి కాల్పుల్లో గాయపడిన ఎస్ఐ సిద్ధయ్య మరణం వారి కుటుంబంలో అంతులేని విషాదాన్నినింపింది. నల్గొండ జిల్లా జానకీపురంలో ఉగ్రవాదుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన సిద్ధయ్య నగరంలోని కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుది శ్వాస విడిచారు.
ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు ఆయన ధరణి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. శనివారం కాల్పుల్లో గాయపడిన సిద్ధయ్యను ఆస్పత్రికి తరలించగా.. అదే రోజు రాత్రి ఆయన భార్య ధరణి మగబిడ్డకు జన్మనిచ్చారు.

సిద్ధయ్య చికిత్స పొందుతున్న కామినేని ఆస్పత్రిలోనే ఆమె ప్రసవించారు. ఆ సమయంలో సిద్ధయ్య మృత్యువుతో పోరాడుతున్నారు. తన బిడ్డను చూడకుండానే.. పెళ్లయిన ఏడాదికే సిద్ధయ్య మరణించడం.. అందర్నీ కలచివేసింది.
కాగా, సిద్ధయ్య మృతితో ఆయన కుటుంబసభ్యులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. సిద్ధయ్య చికిత్స పొందిన కామినేని ఆస్పత్రిలోనే మగబిడ్డకు జన్మనిచ్చిన ఆయన భార్యకు మృతి విషయం తెలియడంతో తీవ్రంగా రోదించారు. ఆమెను ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. సిద్ధయ్య తల్లిదండ్రులు, అత్తామామలు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.












Click it and Unblock the Notifications