మా అన్నయ్యను అవమానించారో అన్న బ్యాచ్ ఎక్కడ..?
టీడీపీ ఎమ్మెల్యే, టాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణ అసెంబ్లీ వేదికగా చేసిన కామెంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. మాజీ సీఎం జగన్‌ను సైకో అని సంబోధించడంతో పాటు, మెగాస్టార్ చిరంజీవిపై సైతం ఆయన అసందర్భంగా అనుచిత వ్యాఖ్యలు చేశారు. గత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో జగన్ మోహన్ రెడ్డిపై కూటమి నేతలు, ముఖ్యంగా పవన్ కల్యాణ్, సినీ పరిశ్రమను అవమానించారనే ఆరోపణలను అస్త్రంగా వాడుకున్న విషయం తెలిసిందే. టికెట్ల ధరల విషయంలో జగన్ ఇండస్ట్రీని కించపరిచారంటూ విస్తృత ప్రచారం జరిగింది. దీనిపై చిరంజీవి కూడా బహిరంగంగా మాట్లాడకుండా, కూటమికి అనుకూలంగా మౌనంగా ఉన్నారు. అయితే, సీనియర్ నటుడు ఆర్. నారాయణ మూర్తి చేసిన తాజా వ్యాఖ్యలు ఈ ప్రచారం వెనుక ఉన్న అసలు నిజాన్ని బయటపెట్టాయి.
ఆర్. నారాయణ మూర్తి మాట్లాడుతూ, టికెట్ల రేట్ల పెంపు విషయంలో జగన్ చిరంజీవిని అవమానించలేదని, అలాగే సినీ ఇండస్ట్రీని తక్కువ చేయలేదని స్పష్టం చేశారు.టికెట్ల రేట్ల విషయంలో జగన్ మోహన్ రెడ్డి గారు చిరంజీవికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. చిరంజీవి ఎలా కోరితే, అలాగే చేద్దామని జగన్ చెప్పారని ఆర్. నారాయణ మూర్తి తెలిపారు. దీంతో, జగన్ ఇండస్ట్రీని అవమానించారన్న ప్రచారం నిరాధారమైనదిగా తేలింది.

అయితే జగన్‌ను ఏం అన్న పర్వాలేదు కానీ, మెగాస్టార్ చిరంజీవిని సైతం బాలకృష్ణ అవమానించడం సంచలనంగా మారింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో బాలకృష్ణపై కామెంట్స్ చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. చిరంజీవి ఒక్కరే తనపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు. అటు ఇండస్ట్రీ నుంచి కూడా ఎవరూ స్పందించలేదు. ఆర్. నారాయణ మూర్తి ఒక్కరే చిరంజీవికి మద్దతిచ్చారు.
కనీసం మెగా బ్రదర్స్ సైతం తన అన్న చిరంజీవికి మద్దతుగా నిలబడలేకపోయారు. పవన్ కల్యాణ్, నాగ బాబు సైతం బాలకృష్ణ చిరంజీవిపై చేసిన కామెంట్స్‌పై నోరు మెదపలేదు. కేవలం కూటమిలో భాగస్వామ్యం కావడం వల్లే వీరు సైలెంట్‌గా ఉన్నారనే మాటలు వినిపిస్తున్నాయి. గతంలో జగన్ చిరంజీవిని అవమానించారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఎన్నికల సమయంలో లబ్ది పొందిన బ్యాచ్ మొత్తం కనిపించడం లేదు. వీరంతా కూడా ఇప్పుడు మాట్లాడితే ఏం ముంచుకొస్తుందో అని తెగ భయపడిపోతున్నారు. ఏది ఏమైనప్పటికీ చిరంజీవిపై బాలకృష్ణ చేసిన కామెంట్స్ సినీ , రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.












Click it and Unblock the Notifications