సోదరిపై కోపంతో బావను చంపేసి, మరీ ఆమెకు చెప్పారు
హైదరాబాద్: తన ఇష్టానికి వ్యతిరేకంగా వ్యవహరించిన సోదరిపై కోపంతో ఆమె అన్నలు బావను చంపేశారు. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి కత్తులను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాదులోని చార్మినార్ తన క్యారాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ అశోక్‌చక్రవర్తి వివరాలు వెల్లడించారు.
కాలపత్తర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోనికి వచ్చే ఫలక్‌నుమా సంజయ్‌గాంధీనగర్ కాలనీ ప్రాంతంలో నివసించే మహ్మమద్ అలీ (30)కి ఇద్దరు భార్యలు, ఐదుగురు సంతానం. అదే ప్రాంతంలో నివసించే మహ్మద్ అహ్మద్ (28) మహ్మద్ రహ్మత్ (20)కు చార్మినార్ సమీపంలోని ముర్గీచౌక్‌లో చికెన్ వ్యాపారం నిర్వహిస్తుంటారు. తమ సోదరికి వివాహం నిర్ణయించారు. పెళ్లి ఐదు రోజులు ఉండగా మహ్మద్ అలీ ఆమెను తీసుకొని వరంగల్‌లో మకాం పెట్టాడు. ఆరు నెలలు అక్కడే గడిపాడు.

తమ మాటలను వినలేదని సోదరిపై ఆగ్రహించిన మహ్మద్ అహ్మద్, రహ్మత్ సోదరులు ఆమెపై పగ తీర్చుకోవాలని అనుకున్నారు. ఇంటికి రావాల్సిందిగా ఫోన్‌లో సోదరిని కోరారు. అన్నల నుంచి ఫోన్ రావడంతో సంతోషించిన ఆమె తన భర్తను తీసుకొని ఇంటికి తిరిగివచ్చారు. అప్పటికే తమ ప్రణాళిక ప్రకారం అడుగులు వేస్తున్న ఆమె సోదరులు చికెన్ దుకాణంలో పని చేస్తున్న మహ్మద్ అయాజ్ (20)ను సహాయం చేయాల్సిందిగా కోరారు. ఇంటికి వచ్చిన ముగ్గురు మహ్మద్ అలీతో ఘర్షణకు దిగారు. ఇద్దరు అతన్ని పట్టుకోగా అయాజ్ కత్తితో దాడి చేశాడు.
వారించేందుకు వచ్చిన సోదరిపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. అయితే గర్భవతి కావడంతో విడిచిపెట్టారు.తన భర్తను రక్షించండని ఆమె ప్రాధేయపడగా ఆస్పత్రికి తీసుకెళ్తున్నామని చెప్పి నిందితులు మహ్మమద్‌ను ద్విచక్ర వాహనంపై కూర్చోబెట్టుకున్నారు. వారి వెనకాలే అయాజ్ కూడా అనుసరించాడు.
మీర్ అలం చెరువు నెక్లస్ రోడ్డుకు తీసుకెళ్లిన నిందితులు కత్తులతో దారుణంగా పొడిచి హత్య చేశారు. హత్య చేసిన విషయాన్ని సోదరికి నిందితులు ఫోన్‌లో సమాచారం అందించారు. వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. గురువారం నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి కత్తులను, వాహనాలను స్వాధీనం చేసుకున్నామని ఏసీపీ తెలిపారు.












Click it and Unblock the Notifications