సిట్ అదుపులో వైసీపీ మాజీ మంత్రి..!!
ఏపీలో రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. లిక్కర్ కేసులో వైసీపీ ముఖ్య నేతలు ఇప్పటికే పలువురు అరెస్ట్ అయ్యారు. ఇతర కేసుల్లో అరెస్ట్ అయిన నేతలు బెయిల్ పైన బయటకు వస్తున్నారు. ఇదే సమయంలో సిట్ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లలో కీలక అంశాలను ప్రస్తావించారు. జగన్ పేరును సిట్ ప్రస్తావించింది. కాగా.. ఈ కేసులో జగన్ హయాంలో కీలక మంత్రిగా పని చేసిన వైసీపీ ముఖ్య నేత అరెస్ట్ పైన ప్రచారం సాగుతోంది. ఇప్పుడు ఈ పరిణామం రాజకీయంగా ఉత్కంఠ పెంచుతోంది.
ఏపీ మద్యం కుంభకోణం కేసులో మాజీ ఎక్సైజ్ మంత్రి నారాయణ స్వామికి ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో విచారణ కోసం ఇప్పటికే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) నోటీసులు జారీ చేసింది. అయితే, అనారోగ్యం, వ్యక్తిగత కారణాల వల్ల విచారణకు రాలేకపోతున్నానని మాజీ మంత్రి నారాయణ స్వామి సిట్ అధికారులకు సమాచారం అందజేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో నారాయణ స్వామి ఎక్సైజ్ శాఖ మంత్రిగా పని చేశారు. ఆయన ప్రమేయం లేకుండానే నూతన మద్యం పాలసీని రూపొందించినట్లు సిట్ అధికారులు భావిస్తున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆయన పాత్ర పైన దర్యాప్తులో తేల లేదని సమాచారం. దీని కారణంగానే మద్యం కుంభకోణం కేసులో సాక్షిగా స్టేట్ మెంట్ ఇవ్వాలని నారాయణ స్వామికి సిట్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

ఇక, ఇప్పుడు పుత్తూరులోని నారాయణ స్వామి ఇంటికే సిట్ అధికారులు రావటం సంచలనంగా మారుతోంది. నారాయణ స్వామిని విచారణ.. స్టేట్ మెంట్ కోసం అధికారులు పరిమితం అవుతారా.. లేక అదుపులోకి తీసుకుంటారా అనేది ఇప్పుడు ఉత్కంఠ పెంచుతోంది. నారాయణ స్వామి ఇంట్లో సిట్ అధికారులు తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే 49 మందిని నిందితులుగా చేర్చారు. ఈ కేసులో రాజ్ కసిరెడ్డి(A1) ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. తాజాగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి (A4)ని అరెస్టు చేసిన విషయం విదితమే. ఈ కేసులో పలువురు కీలక నిందితులపై విచారణ కొనసాగుతోంది. ఎక్సైజ్ మంత్రిగా నారాయణ స్వామి పాత్ర.. నిర్ణయాల వెనుక ఏం జరిగిందనేది సిట్ అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. నారాయణ స్వామి విచారణ వేళ.. సిట్ అధికారులు తీసుకునే నిర్ణయాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications