TTD: తిరుమలలో సిట్ విచారణ, అసలు ఏం జరిగిందో చెప్పండి
తిరుమల శ్రీవారి లడ్డుల తయారిలో కల్తీ నెయ్యి ఉపయోగించారని వెలుగు చూడటంతో ఆ వ్యవహారంపై నిజా నిజాలు వెలుగులోకి తీయడానికి ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) అధికారులు తిరుమల చేరుకున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సిట్ అధికారులు టీటీడీ ఈవో శ్యామలరావుతో పాటు టీటీడీ అధికారులను కలుసుకుని వారితో చర్చించారు.
ఈ సందర్భంగా తిరుమలలో శ్రీవారి లడ్డూల తయారీ కోసం ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందా ? లేదా ? అనే వివరాలు తెలుసుకున్నారు. సిట్ చీఫ్ సర్వ శ్రేష్ట త్రిపాఠితో పాటు ఆయన బృందంలోని పోలీసు అధికారులు శనివారం తిరుమల చేరుకున్నారు. తిరుమల చేరుకున్న సిట్ అధికారులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం తిరుమలలోని అన్నమయ్య భవన్ లో టీటీడీ అధికారులతో సిట్ అధికారులు సమావేశం అయ్యారు.

తిరుమలలోని శ్రీవారి లడ్డు పోటులో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులతో సిట్ అధికారులు మాట్లాడారని, వారి నుండి వివరాలు సేకరించారని తెలిసింది. తిరుమల శ్రీవారి ఆలయం మాడ వీధుల ఆవరణం లోపల ఉన్న శ్రీవారి ఆలయం ప్రాంగణంలోనే తిరుమల లడ్డూలు తయారు చేస్తారు. ఈ లడ్డులు తయారు చేసే లడ్డూ పోటులో వైష్ణవ బ్రాహ్మణులు పని చేస్తుంటారు. ప్రతిరోజు సుమారు మూడు లక్షలకు పైగా శ్రీవారి లడ్డులు తయారు చేస్తుంటారు.
భక్తుల రద్దీని అంచనా వేస్తున్న టీటీడీ అధికారులు అందుకు తగ్గట్టుగా శ్రీవారి లడ్డూలు తయారు చేస్తుంటారు. శ్రీవారి లడ్డూల తయారీ కోసం ఉపయోగించే నెయ్యి, జీడిపప్పు, యాలుకలు, దినుసులు నిల్వ చేసే గోడౌన్లను కూడా సిట్ అధికారులు పరిశీలించారని తెలిసింది. గౌడన్ లో ఉద్యోగం చేస్తున్న టీటీడీ సిబ్బందిని సిట్ అధికారులు విచారణ చేసి వివరాలు సేకరించారని తెలిసింది. మూడు రోజుల పాటు తిరుమల తిరుపతిలో సిట్ అధికారులు విచారణ జరిపి ప్రాథమిక నివేదిక తయారుచేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సమర్పిస్తారని సమాచారం.
ఈ సందర్భంలో పలువురు టీటీడీ అధికారులు, సిబ్బందిని సిట్ చీఫ్ సర్వశ్రేష్ట త్రిపాఠితో పాటు ఆయన బృందంలోని పోలీసు అధికారులు విచారణ చేసి వివరాలు సేకరించే అవకాశం ఉందని తెలిసింది మొత్తం మీద తిరుమల, తిరుపతిలో సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేయడంతో కొందరికి అప్పుడే దడ పుట్టుకుందని తెలిసింది. తిరుమల శ్రీవారి లడ్డూల తయారీ కోసం జంతువుల కొవ్వు కలిపిన కల్తీ నెయ్యి ఉపయోగించారని వెలుగు చూడడంతో దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని తిరుమల శ్రీవారి భక్తులు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications