చిత్తూరులో శివగామి!: నీటిలో మునిగిపోతు బిడ్డను రక్షించుకుంది
చిత్తూరు: బాహుబలి సినిమాలో శివగామి (రమ్యకృష్ణ) బాహుబలిని నీటిలో మునుగుతూ చేత్తో పైకెత్తి పట్టుకొని రక్షిస్తుంది. దాదాపు శివగామిలా చిత్తూరు జిల్లాలోనూ ఓ తల్లి తాను చనిపోయి తన బిడ్డను రక్షించుకుంది. ప్రమాదంలో చిక్కుకున్న ఆ మహిళ తన ప్రాణాలు పోతున్నా, తన కొడుకు మాత్రం బతకాలనుకుంది.
శివగామిలాగే కొడుకును ఎలాగోలా ఒడ్డుకు చేర్చి తాను మాత్రం ప్రాణాలు విడిచింది. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం దిగువకన్నికాపురం గ్రామంలో ఈ సంఘటన జరిగింది. రామకృష్ణ బెంగళూరులో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.
అతడి భార్య భువనేశ్వరి (23) మాత్రం గ్రామంలోనే ఉంటూ పశువులను కాస్తోంది. ఆ దంపతులకు రెండేళ్ల కుమారుడు కర్నాకర్ ఉన్నాడు. శుక్రవారం బిడ్డను చంకనేసుకుని భువనేశ్వరి పశువులను కాసేందుకు వెళ్లింది.

ఇటీవల కురిసిన వర్షాలకు గ్రామ సమీపంలో అటవీ అధికారులు తవ్విన కందకం పూర్తిగా నీటితో నిండిపోయింది. ఆమె కందకంలోకి దిగింది. అయితే లోతు మరీ ఎక్కువగా ఉండటంతో ఆమె క్రమంగా నీటిలో మునిగిపోతోంది.
ప్రమాదాన్ని గమనించిన భువనేశ్వరి తన ప్రాణం పోయినా, బిడ్డ ప్రాణాలు కాపాడింది. చంకలోని కొడుకును ఒక్క వేటుతో ఒడ్డుకు విసిరింది. ఆ మరుక్షణమే ఆమె నీటిలో మునిగిపోయి ప్రాణాలు విడిచింది. ఆ తర్వాత కాసేపటికి భువనేశ్వరి సమీప బంధువు బాలుడు ఒంటరిగా ఉండటాన్ని చూసి అతడిని ఎత్తుకుని చూడగా... ప్రమాదం వెలుగు చూసింది.












Click it and Unblock the Notifications