అనంతపుర్‌లో 'రాజధాని' కమిటీ, ఇప్పుడా అని నిలదీత
హైదరాబాద్/అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపికపై నియమించిన శివరామకృష్ణన్ కమిటీ మంగళవారం అనంతపురం జిల్లాలో పర్యటిస్తోంది. శివరామకృష్ణన్ వెంట కమిటీ సభ్యులు జగన్ షా, కెటి రవీంద్ర, నితిన్‌తో పాటు హైదరాబాదు పట్టణ ప్రణాళికా సంచాలకులు ఉన్నారు.
ముందుగా అనంతసాగరం చెరువును కమిటీ సభ్యులు పరిశీలించారు. ఆ తర్వాత అనంతపురం నగరంలో పర్యటించారు. బెంగళూరు హైవే, స్వాతంత్రోద్యమ కాలం నాటి క్లాక్ టవర్‌ను సందర్శించారు. అనంతరె రెవెన్యూ భవన్‌కు చేరుకొని జిల్లా కలెక్టర్ లోకేష్ కుమార్, జిల్లాకు చెందిన అధికారులతో సమావేశమయ్యారు.
కర్నూలులో నిలదీశారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్త రాజధాని నిర్మాణానికి అనువైన ప్రాంతాన్ని ఎంపిక చేసేందుకు కేంద్రం నియమించిన శివరామ కృష్ణన్ కమిటీ సభ్యులు సోమవారం కర్నూలు నగరంలో పర్యటించిన విషయం తెలిసిందే. హైదరాబాదు నుంచి వచ్చిన కమిటీ సభ్యులు స్థానిక అతిధి గృహానికి చేరుకొని ప్రజా సంఘాల నుంచి వినతిపత్రాలు స్వీకరించాలని నిర్ణయించారు. ఈ మేరకు అతిధి గృహంలోని సమావేశం గదిలోకి కమిటీ సభ్యులు రాగానే రాజధాని సాధన సమితి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు.

మూడు నెలల క్రితం రావాల్సిన కమిటీ ఇప్పుడు రావడం, అదీ అధికారులతో మాత్రమే చర్చించాలని నిర్ణయించడాన్ని వారు తప్పుబట్టారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో రాజధాని ఏర్పాటు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైన 1953 నుంచి 1956 వరకు రాజధానిగా సేవలందించిన కర్నూలును ఇప్పుడు విస్మరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
దీనికి కమిటీ సభ్యులు సమాధానమిస్తూ తాము ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక మాత్రమే ఇచ్చామని, పూర్తిస్థాయి నివేదిక ఇవ్వలేదని వెల్లడించారు. కర్నూలు నగరాన్ని పరిశీలించి అవసరమైన వనరులు ఉన్నాయో లేదో తెలుసుకుని నివేదికలో ఆ విషయాలను పొందుపరుస్తామని తెలిపారు.
అనంతరం కమిటీ సభ్యులు నగరంలోని నాటి శాసనసభ భవనం, సచివాలయం, గవర్నర్ బంగ్లా, నాడు ప్రభుత్వ కార్యాలయాలు, ఉద్యోగుల నివాసం కోసం టెంట్లు వేసిన ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో అధికారులతో సమీక్షించారు.
కర్నూలు చుట్టూ కేవలం 40 కిలోమీటర్ల పరిధిలో సుమారు 50 వేల ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందని, ఒక్క ఎకరా కూడా కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని జిల్లా అధికారులు కమిటీకి నివేదిక అందించారు. నగరానికి అవసరమైన తాగునీరు తుంగభద్ర, కృష్ణానదుల నుంచి తీసుకోవచ్చని, జాతీయ రహదారిపై హైదరాబాదు, బెంగుళూరు నగరాలకు మధ్య ఉన్న కర్నూలు ప్రాంతంలో రాజధాని నిర్మాణానికి అన్ని వసతులు ఉన్నాయని నివేదికలో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications