అద్దంకి వద్ద హైటెన్షన్.. గుండ్లకమ్మ వరదలో ఆరుగురు గల్లంతు..!
తెలుగు రాష్ట్రాల్లో మొంథా తుపాన్ బీభత్సం సృష్టిస్తోంది. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నది పరివాహక ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు, గ్రామాలు జలమయం అయ్యాయి. పలు గ్రామాల్లో రహదారులు తెగిపోవడంతో రాకపోకలు పూర్తిగా స్థంభించాయి. కాగా ఈ క్రమంలోనే అద్దంకి సమీపంలోని గుండ్లకమ్మ ప్రాజెక్టుకు వరద నీరు పెద్దఎత్తున చేరింది.
వరద నీటి ప్రవాహం పెరగడంతో ప్రాజెక్టు వద్ద హెచ్చరిక స్థాయి మించిపోయింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు నిర్వహణ పనుల్లో ఉన్న ముగ్గురు ఉద్యోగులు వరద ప్రవాహంలో చిక్కుకుపోయారు. అయితే చిక్కుకున్న ఉద్యోగులను రక్షించేందుకు మరో ముగ్గురు ఫీల్డ్ సిబ్బంది బోటులో వెళ్లారు. కానీ తిరిగి వస్తుండగా, గుండ్లకమ్మలో ఉప్పొంగిన నీటి ప్రవాహం కారణంగా పడవ బోల్తా పడింది. దీంతో మొత్తం ఆరుగురు వ్యక్తులు నదిలో గల్లంతయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగిస్తుంది.

రెస్క్యూ ఆపరేషన్..
అయితే సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సర్వీస్, రెవెన్యూ, పోలీస్ విభాగాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. మరో బోటును ఉపయోగించి గుండ్లకమ్మలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. గాలింపు బృందాలు డ్రోన్ల సాయంతోనూ గల్లంతైన వ్యక్తులను వెతుకుతున్నాయి. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. జిల్లా కలెక్టర్, ఎస్పీ, రెవెన్యూ అధికారులు సంఘటన స్థలాన్ని పర్యవేక్షిస్తున్నారు.
మరోవైపు గల్లంతైన వారిని రక్షించేందుకు స్పెషల్ NDRF బృందాలు పంపించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రెస్క్యూ బృందాలు నిరంతరంగా శ్రమిస్తూ ఉన్నప్పటికీ, వర్షం, వరద తీవ్రత కారణంగా ఆపరేషన్ కష్టతరమవుతోంది. ఈ వార్తతో బాధితుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ తుపాను కారణంగా ప్రకాశం జిల్లాతో పాటు బాపట్ల, నెల్లూరు, గుంటూరు, కడప జిల్లాలు కూడా భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్నాయి. పలు చెరువులు, ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. ముఖ్యంగా గుండ్లకమ్మ, నాగార్జునసాగర్, వెలిగొండ ప్రాజెక్టుల్లో ప్రవాహం భారీగా పెరిగింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications