బాపట్ల జిల్లాలో తీవ్ర విషాదం.. గ్రానైట్ క్వారీలో ఆరుగురు మృతి !
ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లా బల్లికురవ మండలం సమీపంలో ఓ ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. సత్యకృష్ణ గ్రానైట్ క్వారీలో బండరాళ్లు కుప్పకూలి పడడంతో ఆరుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం సంభవించిన సమయంలో అక్కడ మొత్తం 26 మంది కార్మికులు పని చేస్తున్నట్లు సమాచారం.
ఒక్కసారిగా కూలిన బండరాళ్లు..
ప్రమాద సమయంలో బండరాళ్ల పైభాగం ఒక్కసారిగా విరిగిపడి కింద పడింది. ఆ సమయంలో పదహారు మంది కార్మికులు పని చేస్తుండగా.. ఆరుగురు రాళ్ల కింద నలిగిపోయారని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. మృతులంతా ఒడిశా రాష్ట్రానికి చెందినవారిగా అధికారులు గుర్తించారు.

ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, ఫైర్ సిబ్బంది, రెస్క్యూ టీమ్స్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను బయటకు తీశారు. గాయపడిన వారిని తక్షణమే సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో రాళ్ల మధ్య చిక్కుకున్నవారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
ఈ ఘోర ప్రమాదంపై స్థానిక ప్రజాప్రతినిధులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. క్వారీ యాజమాన్యానికి సంబంధించి భద్రతా ప్రమాణాలు పాటించడంలో నిర్లక్ష్యమేమైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం నుండి సాయం అందించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ముందుస్తు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.












Click it and Unblock the Notifications