YCPకి TDP రాసిచ్చిన నియోజకవర్గాలు!!
రానున్న ఎన్నికల్లో విజయం సాధించాలని రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం తమ తమ వ్యూహాలను అమలు చేస్తున్నాయి. అధికారంలోకి రావడమే కాకుండా అత్యధిక సంఖ్యలో లోక్ సభ స్థానాలను దక్కించుకోవడానికి ఇరు పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఎమ్మెల్యే స్థానాల్లో బలమైన అభ్యర్థులను నిలబెట్టడం, ఎంపీ స్థానాల్లో ఆర్థిక బలం, అంగబలం ఉన్న వ్యక్తులను బరిలోకి దింపడం.. ఇవే రెండు పార్టీలు అనుసరించబోతున్న వ్యూహం.

టీడీపీ పనితీరు మెరుగవలేదు!
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాల్లో బలమైన నాయకులు, కార్యకర్తలు ఇరు పార్టీలకు ఉన్నారు. అయితే కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం కార్యకర్తల బలం ఉన్నప్పటికీ నాయకత్వ బలం టీడీపీకి లోపించింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు ఎన్నికలు జరిగినప్పటికీ వీటిల్లో తెలుగుదేశం పార్టీ పనితీరు ఏమాత్రం బలపడలేదు. దీనివల్ల వీటిల్లో వైసీపీకి అనుకూలతలు కనిపిస్తున్నాయి.

చర్చకు కూడా తీసుకురావడంలేదు..?
అసలు ఈ నియోకవర్గాల్లో గెలుపునకు ఎటువంటి వ్యూహాలు అవలంబించాలి? అనేది కూడా టీడీపీ చర్చకు తీసుకురావడంలేదు. దీంతో అక్కడి పార్టీ శ్రేణులు తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నాయి. కొన్నింటిలో ఇన్ ఛార్జిలను మార్చారు.. మరికొన్నింటికి అసలు ఇన్ ఛార్జిలనే నియమించలేదు. గెలుపుపైన ఆశల సంగతి అలా ఉంచితే.. గట్టి పోటీ ఇవ్వడానికి కూడా ప్రయత్నాలు జరగడకపోవడంతో అధినాయకత్వం తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. అలాంటి నియోజకవర్గాలు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఉన్నాయి.

'గాలి'లో గెలవడంకాదు..!
నెల్లూరు జిల్లాలో గూడూరు, సూళ్లూరుపేట, చిత్తూరు జిల్లాలో గంగాధర నెల్లూరు, పూతలపట్టు, కర్నూలు జిల్లాలో నందికొట్కూరు, కోడుమూరు, కడప జిల్లాలో బద్వేల్, రైల్వేకోడూరు, ప్రకాశం జిల్లాలో యర్రగొండపాలెం, కృష్ణా జిల్లాలోని పామర్రు, తిరువూరుతోపాటు చింతలపూడి, పాడేరు, అరకు, రంపచోడవరం లాంటి సీట్లపై టీడీపీ ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని తెలుగు తమ్ముళ్లు వ్యాఖ్యానిస్తున్నారు.
కార్యకర్తల బలం ఉన్నప్పటికీ బలమైన నాయకుడు లేకపోవడంవల్ల టీడీపీ ఈ నియోజకవర్గాల్లో ప్రతిసారి వెనకబడుతోంది. అధికార పార్టీపై వ్యతిరేకత వ్యక్తమవుతున్న సందర్భంలోను వాటిని దక్కించుకోవడానికి పార్టీ దగ్గర ప్రత్యేక వ్యూహం ఏదీ లేదని శ్రేణులు పెదవి విరుస్తున్నాయి. రానున్న ఎన్నికలు ఎంత కీలకమో అధిష్టానానికి అవగాహన ఉంది.
ఇటువంటి నియోజకవర్గాల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసుకొని ఇప్పటి నుంచే రంగంలోకి దిగితే గట్టి పోటీ ఇవ్వడానికి వీలవుతుంది. అంతేకానీ.. టీడీపీ గాలి వీస్తుంది కాబట్టి.. ఆ గాలిలో గెలవచ్చనే అభిప్రాయం తప్పని రాజకీయ విశ్లేషకులు హితవు పలుకుతున్నారు.












Click it and Unblock the Notifications