భాష కలిపిన బంధం: సాయమందించిన తెలుగువారు
సిమ్లా/హైదరాబాద్: తాము ఎక్కడున్నా.. తెలుగువారంతా ఒక్కటేనని వారు చాటిచెప్పారు. కష్టమొచ్చిన వేళలో అండగా ఉండి ఆదుకుంటామని నిరూపించారు. హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని బియాస్ నది దుర్ఘటన సమయంలో కష్టాల్లో ఉన్న సాటి తెలుగువారిని ఆదుకునేందుకు ఉత్తరాది రాష్ట్రాల్లో ఉంటున్న అనేకమంది తెలుగువారు అక్కడికి చేరుకుని వారికి సహాయ సహకారాలు అందించారు.
బియాస్ నదిలో 24మంది తెలుగు విద్యార్థులు గల్లంతయ్యారని తెలియడంతో హిమాచల్‌ప్రదేశ్, చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఉంటున్న అనేక మంది తెలుగువారు ఘటన స్థలానికి హుటాహుటిన తరలివచ్చారు. కాశ్మీర్, లుథియానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాంచల్ రాష్ట్రాల్లో అనేక మంది తెలుగువారుంటున్నారు. ఉపాధి కోసం కొందరు వెళితే.. ఉద్యోగాల్లో స్థిరపడ్డవారు మరికొందరు ఇక్కడే నివాసముంటున్నారు.

తెలుగు విద్యార్థులు బియాస్ నదిలో గల్లంతయ్యారనే విషయం తెలుసుకున్న హిమాచల్‌ప్రదేశ్ తోపాటు ఇతర పొరుగు రాష్ట్రాల్లో ఉంటున్న తెలుగువారు వివిధ వాహనాల్లో ఘటనా స్థలానికి చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి తమ పిల్లల కోసం ఇక్కడికి వచ్చిన విద్యార్థుల కుటుంబ సభ్యులను వారు ఓదార్చారు. ప్రమాదం నుంచి బయటపడిన విద్యార్థులకు కావాల్సిన అన్నపానీయాలను వారే సమకూర్చారు.
అంతేగాక స్థానికు అధికారులతో మాట్లాడుతూ సమన్వయం చేశారు. విద్యార్థుల బంధువులకు కూడా వారే సమాచారం అందించారు. సమీప హోటళ్లకు చేర్చి అన్ని విధాలుగా సహకరించారని, నిజంగా వారి మేలు మరువలేమని ప్రమాదం నుంచి బయటపడిన బీటెక్ విద్యార్థి రమణ తేజ తెలిపాడు. ఎటూపాలుపోని స్థితిలో ఉన్న తమకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించారని తేజ వివరించాడు. కాగా, గల్లంతైన 24మంది విద్యార్థుల్లో ఇప్పటికి ఆరుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగితా వారి కోసం గాలింపు కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications