'నీ ఆరోపణల్లో నిజాయితీ ఉందా?, నా బ్రతుకులో నిజాయితీ ఉందా?'
తనపై చేసిన వెయ్యి కోట్ల బినామీ ఆస్తుల ఆరోపణలు గనుక నిరూపిస్తే.. ఏ సెంటర్ లో అయినా క్షమాపణ చెప్పడానికి సిద్దం అని టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సవాల్ విసిరారు.
విజయవాడ: 'మలేషియాలోనో.. ఇంకెక్కడో సక్రమంగా ఆస్తులు ఉంటే తప్పులేదు. కానీ నాకు అక్కడ లేవు, ఇక్కడ కూడా లేవు. నాపై చేసిన వెయ్యి కోట్ల బినామీ ఆస్తుల ఆరోపణలు గనుక నిరూపిస్తే.. ఏ సెంటర్ లో అయినా క్షమాపణకు చెప్పడానికి సిద్దం' అంటూ వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్దన్ రెడ్డికి టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సవాల్ విసిరారు.
టీడీపీని, చంద్రబాబును ఎలా బద్నాం చేయాలా అన్న ఆలోచనలో వైసీపీ రాజకీయాలు చేస్తోందని సోమిరెడ్డి ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే కాకాని ఆరోపణల మీద శనివారం మధ్యాహ్నాం ప్రెస్ మీట్ పెట్టిన సోమిరెడ్డి.. ఆయన ఆరోపణలపై ఘాటైన వ్యాఖ్యలతో సమాధానమిచ్చారు.
కాకాని గోవర్దన్ రెడ్డి ఆరోపణల్లో ఎంత మాత్రం నిజం లేదని.. నా ఆస్తులపై ఎక్కడైనా ఫిర్యాదు చేసుకోవచ్చని, ఎదుర్కోవడానికి తాను సిద్దంగా ఉన్నానంటూ సోమిరెడ్డి చెప్పారు. తన మీద గానీ, తమ బాస్ చంద్రబాబు మీద గానీ ఎలాంటి కేసులు లేవని, కానీ తనపై ఆరోపణలు చేస్తున్న కాకాని మీద 6 కేసులు, వాళ్ల పార్టీ అధినేత జగన్ మీద 11 కేసులున్నాయని సోమిరెడ్డి గుర్తుచేశారు.

తప్పుడు ఆరోపణలతో నిజాయితీపరులను కూడా అవినీతి నేతల కింద జమకట్టవద్దని హితవు పలికారు. విదేశాల్లో తమ కుటుంబానికి ఎలాంటి ఆస్తులు లేవని, తన తండ్రి ఇచ్చిన ఆస్తులనే అమ్ముకున్నానని సోమిరెడ్డి తెలిపారు. దమ్ముంటే తనకు సంబంధించిన అక్రమాస్తుల పత్రాలను ఈడీకి సమర్పించాలని కాకాని గోవర్దన్ రెడ్డిని సోమిరెడ్డి సవాల్ చేశారు.
అక్రమాస్తుల కేసుపై డీజీపికి ఫిర్యాదు చేస్తావా? కమిషనరేట్ లో ఫిర్యాదు చేస్తావా? అంటూ కాకానిపై మండిపడ్డారు సోమిరెడ్డి. నీ ఆరోపణల్లో నిజాయితీ ఉందా.. నా బ్రతుకులో నిజాయితీ ఉందా? అన్నది దానితో తేలుతుందన్నారు. ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.
వైసీపీ పార్టీ పూర్తి అవినీతిమయంగా మారిపోయిందని, సంక్షేమ వ్యతిరేక పార్టీగా దానికి ముద్రపడి పోయిందని సోమిరెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యే కాకాని ఆరోపణలు ఓ చీప్ పొలిటీషియన్ తరహాలో ఉన్నాయని, దిగజారుడు రాజకీయాలు చేయడం ఎంతవరకు సబబు అని ఈ సందర్బంగా సోమిరెడ్డి ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications