టిడిపి సీమాంధ్ర, తెలంగాణ నేతల టార్గెట్ కెసిఆర్
హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో తెలుగుదేశం పార్టీకి చెందిన సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు చెందిన ఇద్దరు నాయకులు కూడా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును లక్ష్యం చేసుకుని వ్యాఖ్యలు చేశారు. సీమాంధ్రులకు న్యాయం చేయకుండా రాష్ట్రాన్ని ఎలా విభిజిస్తారని కెసిఆర్ సహా తెలంగాణ నాయకులంతా ప్రశ్నించాలని టిడిపి సీమాంధ్ర నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేస్తుంటే తెలంగాణ రావడం కెసిఆర్‌కు ఇష్టం లేదని టిడిపి తెలంగాణ ప్రాంత నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు దుయ్యబట్టారు.
రాష్ట్ర విభజన విషయంలో కెసిఆర్‌ను, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని సంతృప్తి పరిస్తే చాలునని కాంగ్రెసు అధిష్టానం అనుకుంటోందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. రెండు, మూడు నెలల్లో పోయే ప్రభుత్వం రాష్ట్ర విభజనపై ఎందుకు హడావిడి చేస్తోందని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల్లో ప్రజలు ఎన్నుకుని కొత్త మగాడు ప్రధానిగా వస్తాడని, ఆయనే విభజన అంశాన్ని పరిష్కరిస్తాడని సోమిరెడ్డి అన్నారు. సొంత పార్టీలోనే ఏకాభిప్రాయం లేనప్పుడు విభజన ఎలా చేస్తారని ఆయన అడిగారు.

తెలంగాణ బిల్లు విషయంలో మోసం జరుగుతున్నట్లు కనిపిస్తోందని మోత్కుపల్లి నర్సింహులు అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం నాటకాలాడుతుంటే కెసిఆర్ ఢిల్లీలో ఉండకుండా ఫామ్ హౌస్‌లో ఏం చేస్తున్నారని ఆయన అడిగారు. 2014 వరకు తెలంగాణ రావడం కెసిఆర్‌కు ఇష్టం లేదని ఆయన అన్నారు.
హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తే బాధ్యత కెసిఆర్‌ది, కాంగ్రెసుదేనని ఆయన అన్నారు. మహిళా బిల్లు మాదిరిగా తెలంగాణ బిల్లును కూాడ పార్లమెంటుకు తెచ్చి చేతులు దులుపుకోవాలని కాంగ్రెసు అధిష్టానం చూస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణపై కెసిఆర్‌కు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే సోనియా గాంధీపై ఎందుకు ఒత్తిడి తేవడం లేదని ఆయన అడిగారు.












Click it and Unblock the Notifications