మేం సోనియా కాలర్ పడితే: జగన్‌కు సోమిరెడ్డి నిలదీత
హైదరాబాద్: సమైక్య శంఖారావం బహిరంగ సభపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శనివార నిలదీశారు. విభజన తీరును నిరసిస్తూ టిడిపి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ కాలర్ పట్టుకుంటే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కాళ్లు పట్టుకుందని విమర్శించారు. కాంగ్రెసు పార్టీతో పొత్తుండదని జగన్ ఎక్కడా చెప్పలేదేమని ప్రశ్నించారు. జగన్ నోట ఆ మాటే రాలేదన్నారు.
సోనియా దయాదాక్షిణ్యాలతో జైలు నుంచి బయటకు వచ్చిన వ్యక్తి ఆమెతో కలవబోననే మాట చెప్పకుండా ఎన్ని మాట్లాడినా ఏం ప్రయోజమన్నారు. జగన్ తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావును విమర్శించలేదని, వారి మధ్య కుమ్మక్కుకు ఇంతకన్నా రుజువేం కావాలని ప్రశ్నించారు. ఎపిఎన్జీవోల సభపై నానా రభస చేసిన తెరాస జగన్ సభ జోలికి వెళ్లలేదని, ఇది జగన్ పార్టీకి సహకరించడం కాదా అని ప్రశ్నించారు.

లక్ష కోట్లు తిని 16 నెలలు జైల్లో ఉండివచ్చిన జగన్ చరిత్ర పురుషుడివా, పదేళ్ల పాలనలో అవినీతి మచ్చ అంటని చంద్రబాబు చరిత్రహీనుడా? అని ప్రశ్నించారు. రాజకీయాలు చెడిపోయాయంటున్న జగన్ తండ్రి శవం పక్కనే సిఎం పదవి కోసం సంతకాలు చేయించలేదా? అవినీతి కేసుల్లో ఆయనకు మాత్రమే బెయిల్ వచ్చి, మిగిలిన వారికి రాకపోవడం చెడిన రాజకీయాలకు నిదర్శనం కాదా? వరదల్లో సర్వం కోల్పోయి ప్రజలు అల్లాడుతుంటే వందల కోట్లు ఖర్చు చేసి సభ పెట్టడం మానవత్వమా? 40 నిమిషాల ప్రసంగంలో 30 నిమిషాలు బాబును తిట్టడానికే సభ పెట్టావా అని దుయ్యబట్టారు.
200 కోట్లు ఖర్చు చేసి నిర్వహించిన ఈ సభలో పావలా వంతు కుర్చీలు ఖాళీగా ఉన్నాయని, రెండు కోట్లు తనకిస్తే ఇంత కన్నా పెద్ద సభ పెట్టి చూపిస్తానని సవాల్ విసిరారు. సీమాంధ్రలో మొత్తం 25 ఎంపీ సీట్లు ఉంటే జగన్ మాత్రం 30 గెలిపించాలంటున్నాడని, మిగిలినవి తెరాస నుంచి తెచ్చుకుంటావా? అని సోమిరెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజన పట్ల అడ్డగోలుగా వ్యవహరిస్తున్న సోనియా మొహాన రాజీనామా విసిరి కొట్టకుండా లేఖల డ్రామాలేంటని ముఖ్యమంత్రి కిరణ్‌పై మరో నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు ధ్వజమెత్తారు.
జగన్ సభకు 20 రైళ్లు ఇచ్చారని, చంద్రబాబు దీక్షకు ఢిల్లీకి రెండు రైళ్లు అడిగితే ఒకటిచ్చిన నాలుగు రోజుల తర్వాతగానీ రెండోది ఇవ్వలేదని, వాటిని కూడా అనేక చోట్ల ఆపి, రెండున్నర రోజుల తర్వాత ఢిల్లీకి వెళ్లనిచ్చారన్నారు. ప్రజలు వరదల్లో అవస్థలు పడుతుంటే సిఎం లేఖలు రాయడం, జగన్ సభలు పెట్టడంలో బిజీగా ఉన్నారని బొజ్జల విమర్శించారు.












Click it and Unblock the Notifications