పవన్ - నడ్డా భేటీలో జరిగిందిదే, డౌట్ వద్దు : సోము వీర్రాజు..!!
జనసేనాని పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనపైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ ఢిల్లీలో బీజేపీ జాతీయాధ్యకుడు నడ్డాతో సమావేశం అయ్యారు. ఆ తరువాత ఆసక్తి కర అంశాలను వెల్లడించారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వబోమని స్పష్టం చేసారు. అదే సమయంలో పొత్తులపైన మాత్రం భిన్నంగా స్పందించారు. నిర్ణయం వరకు రాలేదని, సరైన సమయంలో నిర్ణయం ప్రకటిస్తామని పవన్ మరింత ఆసక్తి పెంచారు. ఇదే సమయంలో సోము వీర్రాజు తాజాగా చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు కారణమవుతున్నాయి.
బీజేపీ-జనసేన కలిసే ఉన్నాయని మరోసారి సోము వీర్రాజు చెప్పుకొచ్చారు. రెండు పార్టీల లక్ష్యం ఒక్కటేనని.. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కలిసి పని చేస్తామని వెల్లడించారు. కలిసి ఉద్యమం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. భవిష్యత్తులో కూడా జనసేన, బీజేపీ కలిసే ప్రయాణం చేస్తుందని సోము వీర్రాజు పేర్కొన్నారు. రాజకీయ అవసరాల కోసం సహజంగా అనేక పార్టీ నేతలను కలుస్తామని.. గతంలో చంద్రబాబును కూడా రాష్ట్రపతికి మద్దతు ఇచ్చిన సమయంలో కలిశామని.. అలా కలిసిన వారందరితో పొత్తు ఉన్నట్లు కాదని సోము వీర్రాజు తెలిపారు. తమ పార్టీ పెద్దలను కలిసి పవన్ మాట్లాడారంటే తమ రెండు పార్టీల మధ్య బంధం ఎంత బలంగా ఉందో తెలుసుకోవాలని సోము వీర్రాజు సూచించారు.

బీజేపీ - జనసేన పొత్తు పైన ఎవరికీ అనుమానాలు అక్కర్లేదన్నారు. రాజకీయాల్లో కొన్ని వ్యూహాల మేరకే కొన్ని జరుగుతాయన్నారు. తమ పార్టీకి చెందిన సత్యకుమార్, ఇతర నేతల పైన దాడి విషయంలో పార్టీ కూడా సీరియస్ గా ఉందని వీర్రాజు చెప్పుకొచ్చారు.రాష్ట్రంలో ఆలయాల్లోని విగ్రహాలు ధ్వంసం చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టైనా లేదు ..ఒక్కరినీ ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. రామతీర్ధం, అంతర్వేది రధం దగ్ధం, దుర్గమ్మ ఆలయంలో వెండి సింహాల చోరీ తో పాటు పలు ఘటనలు రాష్ట్రంలో చోటుచేసుకున్నాయని గుర్తు చేసారు. విగ్రహ ధ్వంసం ఘటనలో నిందితులను అరెస్ట్ చేయకుంటే కపిలతీర్దం నుంచి రామతీర్దం దాకా యాత్రచేపడతామని హెచ్చరించారు. బండి సంజయ్ అక్రమ అరెస్ట్ ను వీర్రాజు ఖండించారు. బీఆర్ఎస్ కుట్రలకు బీజేపీ భయపడదన్నారు.












Click it and Unblock the Notifications