2024 ఎన్నికల తర్వాత సోము వీర్రాజు ఆ పని చేస్తారట; జగన్ సర్కార్ కు పోలవరంపై సవాల్
జగన్ సర్కార్ పై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు నిప్పులు చెరిగారు. ఇటీవల వైసీపీ నేతలు కేంద్రాన్ని, కేంద్ర మంత్రిని టార్గెట్ చేసిన నేపధ్యంలో సోము వీర్రాజు రివర్స్ ఎటాక్ చేశారు. వైసీపీ నేతలు పోలవరానికి కేంద్రం నిధులు ఇవ్వడం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని సోము వీర్రాజు మండిపడ్డారు. ఈరోజు విజయవాడలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన సోము వీర్రాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగిందని వ్యాఖ్యానించారు. దేశంలోని 18 రాష్ట్రాలలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసి పాలిస్తున్నామని పేర్కొన్న ఆయన, వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఏపీలో బిజెపికి అధికారం ఇవ్వమని ప్రజలను అడుగుతున్నామని ఆయన స్పష్టం చేశారు.

మీ వల్ల కాకుంటే పోలవరం కేంద్రానికి అప్పగించండి: సోము వీర్రాజు
ఏపీలో సమగ్రమైన నీటి ప్రాజెక్టుల కోసం ప్రణాళికాబద్దంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళుతుందని పేర్కొన్న సోము వీర్రాజు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 11వేల కోట్ల రూపాయలు పోలవరం నిర్మాణానికి ఇచ్చిందని స్పష్టం చేశారు. మరో 700 కోట్లు ఇవ్వాల్సి ఉందని, దీన్ని త్వరలో విడుదల చేస్తామని పేర్కొన్నారు సోము వీర్రాజు. పోలవరం కట్టిన లెక్కల ప్రకారం నిధులను విడుదల చేస్తున్నారని వెల్లడించారు. ఇక పోలవరానికి కేంద్రం నిధులు ఇవ్వడం లేదని వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన సోము వీర్రాజు గతంలో చంద్రబాబు అంచనాలు పెంచేశారు అని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ ఇప్పుడు అవే అంచనాల ప్రకారం నిధులు ఇవ్వాలని ఎలా అడుగుతున్నారు అంటూ నిలదీశారు.రాష్ట్ర ప్రభుత్వానికి చేతకాకపోతే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని కేంద్రానికి అప్పగించాలని సోము వీర్రాజు సవాల్ చేశారు.
అన్నమయ్య, పించా ప్రాజెక్ట్ లపై న్యాయ విచారణకు ఆదేశించండి
ఇక అన్నమయ్య ప్రాజెక్టు గురించి కేంద్ర మంత్రి ప్రస్తావిస్తే కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను తప్పు పడతారా అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు సోము వీర్రాజు. డ్యామ్ కొట్టుకుపోయిన అంశంపై తూతూ మంత్రంగా విచారణ కమిషన్ వేశారని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనపై న్యాయవిచారణ జరిపించాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. జలవనరుల శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే కడప జిల్లాలో అన్నమయ్య, పింఛా ప్రాజెక్టులు కొట్టుకుపోయాయని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.

2024 తర్వాత రాజకీయాలపై సోము వీర్రాజు సంచలనం
ఇక ఇదే సమయంలో సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 తర్వాత తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని, తాను ఏనాడు పదవులు ఆశించి రాజకీయాల్లోకి రాలేదని సోము వీర్రాజు స్పష్టం చేశారు. గడచిన 42 సంవత్సరాలుగా బిజెపి సంస్థతో కలిసి పని చేస్తున్నాడని పేర్కొన్న ఆయన రాష్ట్రాన్ని పాలించే సత్తా బీజేపీకి ఉందని పేర్కొన్నారు. వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజును బిజెపిలో చేరుకున్నారని ఢిల్లీలో వైసిపి ఎంపీలు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్న సోము వీర్రాజు, బ్యాంకులను మోసం చేసిన నాయకుడి బీజేపీలో చేర్చుకుంటారా అని వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఖండించారు.

రఘురామ విషయంలో వైసీపీ నేతల వ్యాఖ్యలపై మండిపాటు
రఘురామ అవినీతి ఈరోజే గుర్తుకు వచ్చిందా అంటూ ప్రశ్నించారు. మీ పార్టీలో టికెట్ ఇచ్చినపుడు ఎందుకు గుర్తు రాలేదు.. చెప్పండి అంటూ వైసీపీ నేతలను ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వంపై వైసీపీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తున్న అంశంపై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు సీఎం సొంత జిల్లాలోనే షుగర్ ఫ్యాక్టరీ మూసేశారు. మీ ప్రభుత్వ పాలనలో ఇన్ని తప్పులు చేస్తూ మాపై నిందలు వేస్తారా అంటూ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు మండిపడ్డారు

మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ల పరిస్థితి తక్షణమే సమీక్షించండి
మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిస్థితిని తక్షణమే సమీక్షించాలని, లేకపోతే పరిణామాలు విపరీతంగా ఉంటాయని ఇప్పటికే పేర్కొన్న సోము వీర్రాజు అన్నమయ్య ప్రాజెక్టు ఉల్లంఘనకు బాధ్యులను గుర్తించి, వారి నుండి నష్టాన్ని వసూలు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా, అన్నమయ్య ప్రాజెక్టు పరిస్థితిని అధ్యయనం చేసిన నిపుణుల కమిటీ నివేదికను త్వరగా విడుదల చేయాలని, పింఛా డ్యామ్ కొట్టుకుపోవడానికి కారణమేమిటో కూడా నిర్ధారించాల్సి ఉందని, అవసరమైన నివారణ చర్యలు తీసుకోవాలి అని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు వెల్లడించారు. కేంద్రం నిధులు ఇస్తున్న పోలవరం మినహా మిగిలిన సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సోము వీర్రాజు అన్నారు.

ఇసుక అక్రమ తవ్వకాల వల్ల ఆనకట్టలు శిథిలావస్థకు
బ్రహ్మ సాగర్ ప్రాజెక్టు కింద కాల్వల నిర్మాణంలో ప్రభుత్వం విఫలమవడంతో రాయలసీమలో వేలాది ఎకరాల్లో పంటలకు నీరు అందడం లేదని ఆయన ఆరోపించారు. గోదావరి జిల్లాల్లోని కాలువలు అత్యంత అధ్వానంగా ఉన్నాయని పేర్కొన్నారు సోము వీర్రాజు. ఇటీవలి వరదల సమయంలో రాయలచెరువు కట్ట పగుళ్ల కారణంగా ప్రజలు చెప్పలేని ఇబ్బందులకు గురయ్యారని ఆరోపించారు. ఇంత జరుగుతున్న మైనర్ ప్రాజెక్టుల పటిష్టతపై ఉన్నత స్థాయి సమీక్ష జరగలేదని, ఇసుక అక్రమ తవ్వకాల వల్ల ఆనకట్టలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయని సోము వీర్రాజు అనుమానం వ్యక్తం చేశారు. అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోవటానికి ఇసుక తవ్వకాల కోసం ఉన్న టిప్పర్ లే కారణం అని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు అభిప్రాయం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications