ఆత్మకూరు పాకిస్థాన్లో భాగమా? సీఎం జగన్.. బేషరతుగా ఆ కేసులు ఉపసంహరించుకోవాలన్న సోము వీర్రాజు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఏపీ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు టార్గెట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వైసీపీది మతతత్వ ప్రభుత్వమని సోము వీర్రాజు మండిపడ్డారు. సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి చర్చిలు, మసీదులు ఎలా కడతారని సోము వీర్రాజు ప్రశ్నించారు. ఆత్మకూరులో అనుమతిలేకుండా రెండు రోజుల్లో ఇళ్ల మధ్య మసీద్ కట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు సోము వీర్రాజు.

ఇళ్ళ మధ్య మసీదు.. అడిగితే చంపే యత్నం
ఇదిలా ఉంటే కర్నూలు జిల్లా ఆత్మకూరు లో జరిగిన ఘటన పై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చాలా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఇళ్ల మధ్య మసీదులు కట్టవద్దని చెప్తే చంపే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపణలు గుప్పించారు. ఎంత మందిని భయ బ్రాంతులకు గురిచేస్తారని సోము వీర్రాజు మండిపడ్డారు. రాజ్యాంగంలో ఉన్న ఓ ముఖ్యమంత్రి ఆ పనులు చేయొచ్చా అంటూ ప్రశ్నించిన సోము వీర్రాజు, చట్టాన్ని రక్షించాల్సిన ఉపముఖ్యమంత్రి కాకమ్మ కబుర్లు చెబుతున్నారు అంటూ మండిపడ్డారు.

ఆత్మకూరు పాకిస్థాన్లో ఒక భాగమని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నారా?
ఆత్మకూరు ఆంధ్ర ప్రదేశ్ లో ఉందా లేదా అని సోము వీర్రాజు ప్రశ్నించారు. ఇక ఇప్పటికే ఆత్మకూరు ఘటనపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ రాసిన సోము వీర్రాజు ఆత్మకూరు పాకిస్థాన్లో ఒక భాగమని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నారా? అంటూ మండిపడ్డారు. ఆత్మకూరు ఘటన జరిగి 24 గంటలు గడిచినా ఏపీ సీఎం దీనిపై ఇప్పటివరకు ఎందుకు ప్రకటన చేయలేదని ప్రశ్నించారు సోము వీర్రాజు. ఒక వర్గం వారి పై ఉద్దేశపూర్వకంగా దాడి చేస్తే ముఖ్యమంత్రి మౌనం దేనికి సంకేతమో చెప్పాలంటూ సోము వీర్రాజు ప్రశ్నించారు.

ప్రశ్నించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడిపై దాడి చేస్తారా?
అధికారుల అనుమతి లేకుండా మసీదు నిర్మాణం ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఇక ఇదే విషయాన్ని పోలీసుల సమక్షంలో బిజెపి జిల్లా అధ్యక్షులు బుడ్డ శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారని కానీ ఆయన పైన దాడి చేసి ప్రాణ హాని తలపెట్టడానికి ప్రయత్నించారని సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా ఆత్మకూరు పట్టణంలో అక్రమ మసీదు నిర్మాణంపై ఫిర్యాదు చేసిన బిజెపి జిల్లా అధ్యక్షులు బుడ్డా శ్రీకాంత్ రెడ్డి గారు,ఇతర నాయకులపై, పోలీసులపై దాడి చేసి,వాహనాన్ని దగ్ధం చేసిన వారిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కఠినమైన చర్యలు తీసుకోవాలని బిజెపి ఆంధ్రప్రదేశ్ కోరుతున్నదని ఆయన డిమాండ్ చేశారు.

ఈ విషయంలో ఎంత దూరమైనా వెళ్తాం
స్థానిక శాసనసభ్యులు తదితరులు కలిసి దాడిచేసిన వారిని వదిలేసి,దాడి కాబడ్డ వారిపైన అక్రమ కేసులు బనాయించాలని చూస్తున్నారన్న వార్తలు వింటున్నామని ఆయన పేర్కొన్నారు.అలాంటి తప్పుడు ఆలోచనలు ఏవైనా ఉంటే వెంటనే ఉపసంహరించుకోవాలని,లేని పక్షంలో బిజెపి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమానికి తెరతీస్తుందని హెచ్చరిస్తున్నామని సోము వీర్రాజు స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎంత దూరమైనా వెళ్తానని ఆయన బిజెపి నేతల పై పెట్టిన కేసులను బేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

ఏపీలో పరిస్థితిపై సోము వీర్రాజు ఫైర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం ఏరులై పారిస్తున్నారని, పీ ఆర్ సి అర్థం కాని బ్రహ్మపదార్థం గా తయారయిందని సోము వీర్రాజు మండిపడ్డారు. యువతకు ఉద్యోగాలు ఇచ్చే అవసరం ఉండదని ఉద్యోగులకు వయోపరిమితి పెంచారని సోము వీర్రాజు అభిప్రాయపడ్డారు. దేశంలో ఎన్నికలు జరిగే అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీ అధికారంలోకి వస్తుందని, బీజేపీ అధికారంలోకి వస్తే రైతులకు గిట్టుబాటు ధరలు ఇస్తుందని సోము వీర్రాజు పేర్కొన్నారు. జనసేనతో కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని వెల్లడించిన సోము వీర్రాజు, తెలుగుదేశం పార్టీ నుండి బిజెపి లోకి వచ్చిన నేతలను కోవర్టులు అనడం సరికాదంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications