సోము వీర్రాజు పవన్ కళ్యాణ్ మనిషి: టిడిపిపై పోరు వెనక...?
విజయవాడ: బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు సన్నిహితుడని అంటారు. అందువల్లనే ఆయనకు బిజెపి తరఫున ఎమ్మెల్సీ టికెట్ వచ్చిందని చెబుతారు. ఇందులో మరో కోణం కూడా ఉంది. పవన్ కళ్యాణ్‌తో బంధాన్ని పటిష్టపరుచుకోవడానికి చంద్రబాబే స్వయంగా బిజెపి అధిష్టానంతో మంతనాలు జరిపి సోము వీర్రాజును ఎమ్మెల్సీగా చేసినట్లు కూడా చెబుతారు. ఈ విషయాన్ని స్వయంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ప్రస్తుత వివాదం నేపథ్యంలో అంటున్నారు.
అటువంటి సోము వీర్రాజు తెలుగుదేశం పార్టీపై విరుచుకుపడుతున్నారు. ఆయనపై తెలుగుదేశం పార్టీ నాయకులు ఎదురుదాడికి దిగుతున్నారు. సోము వీర్రాజు నోరు అదుపులో పెట్టుకోవాలని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు బోండా ఉమామహేశ్వర రావు తాజాగా శుక్రవారం హెచ్చరించారు. ప్రస్తుత స్థితి చూస్తుంటే, బిజెపి, టిడిపి స్నేహం బీటలు వారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.

చంద్రబాబు ప్రభుత్వంపై బిజెపి నాయకులు కావూరి సాంబశివరావు, కన్నా లక్ష్మినారాయణ వంటి నాయకులు విమర్శలు చేస్తున్నారు. అందరికన్నా ఎక్కువగా సోము వీర్రాజు గొంతు పెంచారు. ఇదంతా వ్యూహం ప్రకారమే జరుగుతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోము వీర్రాజుకు బిజెపి ఎమ్మెల్సీ టికెట్ ఖరారైనప్పుడు రాయలసీమ బిజెపి నేతలు నిరసన గళాలు కూడా వినిపించారు. ఈ నిరసన గళాలను కూడా బిజెపి అధిష్టానం పట్టించుకోలేదు.
బిజెపి నాయకులు ఎన్ని విమర్శలు చేసినా చంద్రబాబు మాత్రం నోరు విప్పడం లేదు. బిజెపి నాయకులు చేస్తున్న విమర్శలను పార్టీ నాయకులు తన దృష్టికి తెస్తే సంయమనం పాటించాలని చూస్తున్నారు. బిజెపిని దూరం చేసుకోవడానికి ఇష్టం లేకనే చంద్రబాబు మౌనంగా ఉంటున్నారనే మాట వినిపిస్తోంది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా రోజులుగా రాజకీయాలు మాట్లాడడం లేదు. ఆయన ఆంతర్యమేమిటో తెలియడం లేదు. కానీ, బిజెపి వ్యూహంలో భాగంగానే పవన్ కళ్యాణ్ కూడా మౌనం వహిస్తున్నారా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి పవన్ కళ్యాణ్‌తో జత కట్టి ముందుకు సాగాలని వేసిన ఎత్తుగడలో భాగంగానే ప్రస్తుతం మిత్రపక్షాల మధ్య వివాదం చోటు చేసుకుందా అనే అనుమానాలు మాత్రం ఉన్నాయి.












Click it and Unblock the Notifications