సోనియా ఫ్లెక్సీకి సమాధి: తెల్సుకోవాలని కిరణ్ నిప్పులు
హైదరాబాద్: తన సొంత జిల్లా చిత్తూరులోని తిరుపతిలో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ చిత్రపటానికి సమాధి కట్టడంపై వస్తున్న విమర్శల మీద ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోమవారం స్పందించారు. సోనియా దిష్టిబొమ్మకు తిరుపతిలో కొన్ని అసాంఘిక శక్తులు, మానసిక స్థితి సక్రమంగా లేని వ్యక్తులు సమాధి కట్టిన ఘటనపై తాను స్పందించలేదంటూ కొందరు ఆరోపించడం సత్యదూరమని కిరణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కుత్సిత వ్యాఖ్యలు చేయొద్దని హితవు పలికారు.
ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. సోనియా దిష్టిబొమ్మకు తిరుపతిలో సమాధి కట్టిన సమాచారం తెలిసిన మరుక్షణమే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫోన్‌లో ఆదేశించానని చెప్పారు. ఇలాంటి నీచమైన, నీతిమాలిన చర్యలకు పాల్పడేవారు ఎంతటివారైనా, ఏ పార్టీకి చెందిన వారైనా విడిచిపెట్టరాదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చానని చెప్పారు.

ఇప్పటికే బాధ్యులపై కేసులు నమోదు చేశారని తెలిపారు. పదిమంది నిందితులను అరెస్టు చేశారని ప్రస్తుతం వారు రిమాండ్‌లో ఉన్నారన్నారు. మానసిక స్థితి సక్రమంగా లేని కొందరు నాయకులు కక్షపూరిత ధోరణితో, పదే పదే తనపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నీచమైన, దిగజారుడు రాజకీయాలకు పాల్పడడం శోచనీయం, విచారకరమన్నారు. ఆరోపణలు చేసే ముందు కొంత మానసిక పరిజ్ఞానాన్ని వినియోగించడం, వాస్తవాలు తెలుసుకోవడం మంచిదని హితవు పలికారు. అక్టోబర్ 15న ఈ ఘటన జరిగిన విషయం తెలియగానే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించానన్నారు.












Click it and Unblock the Notifications