బీజేపీకి చిక్కు: ఏపీకివ్వాలని మోడీకి సోనియా లేఖ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీకి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ లేఖ రాశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని లేఖలో కోరారు. విభజన చట్టాన్ని అమలు చేయాలని అందులో విజ్ఞప్తి చేశారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాలంటూ శుక్రవారం రాసిన లేఖలో పేర్కొన్నారు.
రాష్ట్ర విభజన సందర్భంగా నాటి సర్కార్ ఇచ్చిన ఏ హామీని ఎన్డీఏ సర్కార్ నెరవేర్చలేదని లేఖలో ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తామని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ప్రకటించారని గుర్తుచేశారు. అలాగే రైల్వే బడ్జెట్‌లో ఏపీకి భారీగా నిధులు కేటాయించడంతో పాటు, ఏపీ లోటు బడ్జెట్‌ను పూడ్చాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాంగ్రెస్ ఆధ్వర్యంలోని తమ యూపీఏ ప్రభుత్వమే ప్రత్యేక హోదా ఇచ్చిందని, దానికి మంత్రి వర్గ ఆమోదం లభించిందని, ఆ ఉత్తర్వులను బయటపెడతామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ గురువారం చెప్పిన విషయం తెలిసిందే.

నాటి ప్రధాని మన్మోహన్ సీమాంధ్రకు ఐదేళ్లపాటు ప్రత్యేక హోదా అని ప్రకటిస్తే, బీజేపీ నేతలు మాత్రం పదేళ్లు కావాలని పట్టుబట్టారని తెలిపారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వబోమంటున్నారని విమర్సించారు. యుపిఎ ప్రత్యేక హోదా ఇవ్వలేదని వెంకయ్య నాయుడి మాటలకు జవాబు ఇస్తూ అందుకు సంబంధించిన ఉత్తర్వులను బయటపెడ్తామని దిగ్విజయ్ అన్నారు.
ఇటీవల ఏపీకి ప్రత్యేక హోదా పైన బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం జరుగుతోంది. ఏపీకీ ప్రత్యేక హోదా ఇద్దామంటే మిగతా రాష్ట్రాలు పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రత్యేక హోదా పైన ఆచితూచి స్పందిస్తోంది.
మరోవైపు, ప్రత్యేక హోదా హామీ నెరవేర్చడం లేదని కాంగ్రెస్ మండిపడుతోంది. దీనికి బీజేపీ, టీడీపీలు కౌంటర్ ఇచ్చాయి. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రుల నుండి అనుమతి తీసుకు రావాలని ఆ పార్టీలు కాంగ్రెస్‌ను సవాల్ చేశాయి. ఈ నేపథ్యంలో సోనియా లేఖ రాయడం గమనార్హం.












Click it and Unblock the Notifications