పదేళ్లు కావాలన్నారు కదా: వెంకయ్యపై సోనియా
హైదరాబాద్: రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు ఎన్. రఘువీరా రెడ్డితో అన్నారు. ఆనాడు లోక్‌సభ, రాజ్యసభల్లో చర్చ సందర్భంగా ఐదేళ్లు కాదు పదేళ్లపాటు ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాల్సిందేనని డిమాండ్ చేసిన బీజేపీ నేతలు ఇప్పుడు ఎలా వెనక్కి వెళుతారని ఆమె ప్రశ్నించారు. ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామంటే పదేళ్లు కావాలని పట్టుబట్టారు కదా అని రాజ్యసభలో ప్రస్తుత కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు విభజన చట్టం ఆమోదం సమయంలో పట్టుబట్టిన విషయాన్ని గుర్తు చేస్తూ అన్నారు.
ఎపికి ప్రత్యేక హోదాపై రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ తీసుకుంటున్న చర్యలు, ఉద్యమాలు బాగున్నాయి. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో దీనిపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆమె రఘువీరాతో చెప్పారు. తగిన కార్యాచరణపై వార్ రూమ్‌లో చర్చించాలని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్, ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డికి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ సూచించారు.

బుధవారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీని దిగ్విజయ్, రఘువీరా కలిశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం రాష్ట్రంలో చేపడుతున్న ఉద్యమం గురించి రఘువీరా సుదీర్ఘంగా వివరించారు. ఈ అంశంపై చర్చించేందుకు వీలుగా లోక్‌సభలో పార్టీ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్, జైరాం రమేష్, అహ్మద్ పటేల్, దిగ్విజయ్ సింగ్‌తో వార్ రూమ్‌లో సమావేశం కావాలని రఘువీరాను సోనియాగాంధీ ఆదేశించారు. ఈమేరకు బుధవారం వార్ రూమ్‌లో వీరు సమావేశమై పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.
కాగా, ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వటంలో ఉన్న ఇబ్బందుల గురించే తాను మాట్లాడాను తప్ప ఏపీకి ప్రత్యేక హోదా అమలు చేయటం సరికాదని తాను ఎన్నడూ అనలేదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు వివరణ ఇచ్చారు. ఈ అంశంపై గత కొద్ది రోజులుగా పెద్దఎత్తున విమర్శలు రావటంతో వెంకయ్య బుధవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. విభజన చట్టానికి కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా విభజన చట్టానికి సవరణలు చేయదని తెలిపారు.












Click it and Unblock the Notifications