వేసవి సెలవుల వేళ ప్రత్యేక రైళ్లు - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!!
వేసవి సెలవుల రద్దీని ఎదుర్కొనేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే రెగ్యులర్ మార్గాల్లో రద్దీకి అనుగుణంగా ప్రత్యేక కోచ్ ల సంఖ్య పెంచుతోంది. వేసవి సెలవులతో పాటుగా ఎన్నికల కోసం సొంత ప్రాంతాలకు వచ్చే వారితో ఇప్పటికే మే 11,12,13 తేదీల్లో తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే రైళ్లు దాదాపు ఫుల్ అయ్యాయి. ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్న డిమాండ్ మేరకు వారాంతపు రైళ్లను నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది.
ఈ సారి వేసవి సెలవుల వేళ్ల రైళ్లల్లో రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఇప్పటికే కనిపిస్తున్న వెయిటింగ్ లిస్టుల ఆధారంగా వారాంతంలో ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. ప్రత్యేక రైళ్ల వివరాలను అధికారులు వెల్లడించారు. 07234 నంబర్ గల రైలు ఈనెల 28 నుంచి జూన్ 30వ తేదీ వరకు ప్రతి ఆదివారం సికింద్రాబాద్ నుంచి సంత్రగచి వరకు నడుస్తుందని అధికారులు తెలిపారు.

ఈ రైలు రాత్రి 11.40 గంటలకు బయలు దేరి నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు , విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, అనకాపల్లి , విజయనగరం , శ్రీకాకుళం, బరంపూర్, భువనేశ్వర్, కటక్ , ఖరగ్‌పూర్ మీదుగా మంగళవారం ఉదయం 5 గంటలకు సంత్రగచికి చేరుకుంటుందని వివరించారు.
ఇదే రైలు 07235 నంబర్‌తో ఈనెల 30వ తేదీ నుంచి జూలై 2 వరకు మంగళవారాల్లో సంత్రగచిలో మధ్యాహ్నం 12.20కు బయలు దేరి బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుతుందన్నారు. 18 బోగీలతో నడిచే ఈ రైళ్లలో ఎటువంటి రిజర్వేషన్ సౌకర్యం ఉండదని ఆయన వెల్లడించారు. యూటీఎస్ మొబైల్ యాప్ ద్వారా టికెట్లు తీసుకోవచ్చని సూచించారు.
అదే విధంగా ఇప్పటికే ప్రకటించిన రైళ్లకు ప్రయాణీకుల నుంచి డిమాండ్ కనిపిస్తోంది. దీంతో..ఆ రైళ్లల్లో ప్రత్యేక కోచ్ లు ఏర్పాటు పైన ఆలోచన చేస్తున్నారు. జూన్ 12 వ తేదీ వరకు విద్యా సంస్థలకు సెలవులు ఉన్నాయి. మే నెలాఖరు వరకు ప్రయాణీకుల రద్దీ కొనసాగుతుందని భావిస్తున్న అధికారులు దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications