విశాఖ - సికింద్రాబాద్ ప్రధాన ఎక్స్ ప్రెస్ రైలు రద్దు..!!
దక్షిణ మధ్య రైల్వే అధికారులు కీలక ప్రకటన చేసారు. విశాఖ - సికింద్రాబాద్ మధ్య నడుస్తున్న ప్రధాన రైలును తాత్కాలికంగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. విశాఖ రైల్వే జోన్ గా కేంద్రం నిర్ణయం తీసుకోవటంతో కేకే లైన్ గురించి చర్చ సాగుతోంది. ఇదే సమయంలో విశాఖ నుంచి పలు ప్రధాన నగరాలకు రైళ్ల కేటాయింపు ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. విశాఖ నుంచి సికింద్రా బాద్ కు ప్రస్తుత నడుస్తున్న రైళ్లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ సమయంలోనే రైల్వే అధికారులు ప్రయాణీకులకు బిగ్ అలర్ట్ ఇచ్చారు.
లింగంపల్లి - విశాఖ మధ్య నడిచే జన్మభూమి ఎక్స్ ప్రెస్ ను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. విజయవాడ డివిజన్ లో పనుల కారణంగా పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో, విశాఖ నుంచి లింగంపల్లి వచ్చే జన్మభూమి ఎక్స్ ప్రెస్ (12805) మార్చి 2న..అదే విధంగా లింగంపల్లి నుంచి విశాఖ వెళ్లే జన్మభూమి ఎక్స్ ప్రెస్ (12806) మార్చి 3న రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, ఇప్పటికే ఈ తేదీల్లో ఈ రైలు కోసం పెద్ద సంఖ్యలో ప్రయాణీకులు రిజర్వేషన్ చేయించుకున్నారు. తాజాగా అధికారుల ప్రకటనతో ప్రయాణీకులు ఇబ్బందులు తప్పేలా లేవు.

ఇక, విశాఖ - సికింద్రాబాద్ మధ్య నడిచే వందేభారత్ కు డిమాండ్ పెరుగుతోంది. ఈ రైలుకు కొద్ది రోజుల క్రితం కోచ్ ల సంఖ్య పెంచారు. ఇంకా రద్దీ కొనసాగుతోంది. ఈ రైలు నిత్యం ఆలస్యంగా నడుస్తుండటం పైన ప్రయాణీకుల్లో అసహనం కనిపిస్తోంది. ఈ వందేభారత్ కోసం ఈ మార్గంలో నడిచే పలు రైళ్లు ఆలస్యం అవుతున్నాయనే విమర్శలు ఉన్నాయి.
తాజాగా విశాఖ నుంచి బెంగళూరు కు వందేభారత్ స్లీపర్ ఏర్పాటు చేయాలని రైల్వే మంత్రికి స్థానిక ప్రజా ప్రతినిధుల నుంచి వినతులు అందాయి. కొద్ది రోజుల్లో వందేభారత్ స్లీపర్ పట్టాలెక్కనుంది. తొలి విడతలోనే ఏపీకి ఒక వందేభారత్ స్లీపర్ కేటాయిస్తారని సమాచారం. అయితే, విజయవాడ నుంచి అయోధ్య , వారణాసికి ఈ రైలు ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications