విజయవాడకు గుడ్‌న్యూస్: కేంద్ర మంత్రి చొరవ
రోజురోజుకు ప్రయాణికుల రద్దీ పెరుగుతుండటంతో భారతీయ రైల్వే అదనపు రైళ్లను ఏర్పాటు చేస్తోంది. రోజువారీ తిరిగే రైళ్లకు తోడు అదనంగా ఏర్పాటు చేసిన రైళ్లు కూడా తిరుగుతుండటంతో స్టేషన్ల వద్ద ట్రాఫిక్ ను నియంత్రించడం కష్టతరమవుతోంది. దీంతో రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లో దక్షిణ మధ్య రైల్వే మూడో లైను నిర్మాణ పనులు చేపట్టింది. దీనిలో భాగంగా విజయవాడ-గూడూరు మధ్య మూడో లైను పనులు జరుగుతుండటంతో మొత్తం 25 రైళ్లను అధికారులు రద్దు చేశారు. వీటిల్లో విజయవాడ-గూడూరు-విజయవాడ(12734, 12733) మధ్య తిరుగుతున్న రెండు రైళ్లు కూడా ఉన్నాయి.
రోజువారీ ప్రయాణానికి ఇబ్బంది
ఈ రైళ్లద్వారా విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, కార్మికులు విజయవాడ నుంచి తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు మీదుగా రోజువారీ ప్రయాణం చేస్తున్నారు. ఈ రెండింటినీ రద్దుచేయడంద్వారా వీరు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయాన్ని ప్రయాణికులు కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ దృష్టికి తీసుకువెళ్లారు.

వెంటనే ఆయన ఈ విషయంపై దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ కు లేఖ రాశారు. వెంటనే స్పందించిన జీఎం ఈ రెండు రైళ్లను పునరుద్ధరించారు. సోమవారం సాయంత్రం ఆదేశాలు జారీచేయగా మంగళవారం ఉదయం పట్టాలెక్కాయి. ఈ సందర్భంగా ప్రయాణికులు మంత్రి పెమ్మసానికి ధన్యవాదాలు తెలిపారు.
మొత్తం 25 రైళ్లు రద్దుచేశారు
గతేడాది ఒడిసాలోని బాలాసోర్ వద్ద కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో దాదాపు 300కు పైగా ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. దీనికి సిగ్నలింగ్ వ్యవస్థలో లోపమే కారణమని గుర్తించిన భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా సిగ్నలింగ్ వ్యవస్థను ఆధునికీకరిస్తోంది. దీనిలో భాగంగా అన్ని రైల్వే జోన్లు, డివిజన్ల పరిధిలో పనులు జరుగుతున్నాయి. విజయవాడ డివిజన్ లో కూడా పనులు జరుగుతుండటంతో మొత్తం 25 రైళ్లను రద్దుచేశారు. ఆ రద్దయిన రైళ్లల్లో విజయవాడ-గూడూరు-విజయవాడ మధ్య తిరుగుతున్న రైలు కూడా ఉంది. మంత్రి చొరవతో దాన్ని అధికారులు వెంటనే పునరుద్ధరించారు.












Click it and Unblock the Notifications