ఏపీలో చినుకులు ఎక్కడున్నాయో దొరికాయి!
నైరుతి రుతుపవనాలు ఈనెల రెండో తేదీన ఏపీలోకి ప్రవేశించి రాష్ట్రమంతటా విస్తరించాయి. ఉత్తరాంధ్ర నుంచి విస్తరించిన తర్వాత స్తబ్దుగా ఉండిపోవడంతో చినకు జాడ లేకుండా పోయింది. వేసవికాలంలో ఉన్నట్లుగా ఎండలు మండిపోతుండటంతో ప్రజలు ఇక్కట్లకు గురవుతున్నారు. వేడికి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీంతో ప్రజలు ముఖ్యమైన పనులుంటే ఉదయం 11.00 గంటల్లోపునే చూసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచిస్తోంది.
చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు
ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో వాతావరణశాఖ శుభవార్తను వినిపించింది. రానున్న రెండురోజుల్లో ఏపీ, తెలంగాణలో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. గంటలకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, హైదరాబాద్ లో మోస్తరు వర్షం కురుస్తుందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. నైరుతి రుతుపవనాలు క్రమంగా విస్తరిస్తున్నాయని, దాదాపు పదిరోజుల సమయం తర్వాత చురుగ్గా కదిలి ముందుకు పయనిస్తున్నాయని తుఫాను హెచ్చరికల కేంద్రం పేర్కొంది. విజయనగరం వరకు వచ్చి ఆగిపోయిన రుతుపవనాలు ఏపీలోని మిగిలిన ప్రాంతాలకు, ఒడిసా, విదర్భ ప్రాంతాలకు విస్తరించాయి.

మరింత బలం పుంజుకోవాల్సి ఉంది
రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నప్పటికీ మరింత బలం పుంజుకోవాల్సి ఉందంటున్నారు. ఈ ప్రభావం వల్ల కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయి. మరికొన్నిచోట్ల పిడుగులతో వర్షాలు పడతాయి. విజయనగరం, శ్రీకాకుళం, మన్యం అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణ, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. మరోవైపు ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని లక్షలాది ఎకరాల్లో పత్తి విత్తనాలను నాటిన రైతులు చినుకు జాడలేకపోవడంతో నిరాశకు గురయ్యారు. కొన్నిచోట్ల విత్తనాలు ఎండిపోవడంతో రెండోసారి నాటేందుకు సిద్ధమయ్యారు. వర్షాలు కురిస్తే విత్తనాలు మొలకెత్తుతాయేననే ఆశతో ఉన్నారు.












Click it and Unblock the Notifications