అసెంబ్లీలో డిప్యూటీ సీఎం సవాల్ - టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ : ఇది మా ఖర్మ - స్పీకర్..!!
ఏపీ అసెంబ్లీలో మరోసారి టీడీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు పడింది. వరుసగా మూడో రోజు సైతం సభలో జంగారెడ్డి గూడెం ఘటన పైనే టీడీపీ సభ్యులు చర్చకు పట్టుబట్టారు. సోమవారం దీని పైన ప్రభుత్వం ప్రకటన చేయటంతో పాటుగా సీఎం సైతం వివరణ ఇచ్చారని స్పీకర్.. డిప్యూటీ సీఎం ఆళ్ల నాని చెప్పుకొచ్చారు. అయితే, ఇదే విషయంలో అనుచితంగా వ్యవహరిస్తున్నారంటూ టీడీపీకి నుంచి అయిదుగురు సభ్యులను ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేసారు. కాగా, మంగళవారం సైతం ఇదే అంశం పైన సభలో టీడీపీ ఆందోళన కొనసాగించింది. దీంతో.. సభ నుంచి టీడీపీ సభ్యులను ఒకరోజు సస్పెండ్ చేసారు.

టీడీపీ సభ్యుల సస్పెన్షన్
ఈ రోజు సభ ప్రారంభమైన తరువాత కూడా టీడీపీ సభ్యులు అదే అంశం పై నినాదాలు చేసారు. సభను అడ్డుకోవటం కోసమే టీడీపీ ఉద్దేశ పూర్వకంగా ఇలా వ్యవహరిస్తోందని ఆర్దిక మంత్రి బుగ్గన మండిపడ్డారు. అదే సమయంలో ఈ ఘటన పైన ప్రభుత్వం సమాధానం ఇచ్చిందని..జంగారెడ్డి గూడెంలో మరణించిన వారి విషయంలో ఒక్కొక్కరు ఒక్కో కారణంతో మరణించినట్లుగా డాక్టర్లు నివేదికలు ఇచ్చారని ఆళ్ల నాని చెప్పుకొచ్చారు. అయినా..టీడీపీ సభ్యులు ఆందోళన వీడ లేదు. ఆ సమయంలో స్పీకర్ తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేసారు.

స్పీకర్ సీరియస్..ఖర్మ అంటూ
ఇది మంచి పద్దతి కాదు. సభలో ఏ భాషలో మాట్లాడాలో తెలియని మీరు ఎమ్మెల్యేలా.. ఇది మా కర్మ..అంటూ స్పీకర్ టీడీపీ సభ్యుల పైన సీరియస్ అయ్యారు. సభను వాయిదా వేసారు. సభ తిరిగి ప్రారంభమైన తరువాత సైతం టీడీపీ సభ్యులు అదే అంశంపైన ఆందోళన కొనసాగించారు. దీంతో.. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కీలక వ్యాఖ్యలు చేసారు. రేపు మీ బండారం బయట పెడతానంటూ టీడీపీ సభ్యులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తాను నిరూపించలేకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని వెల్లడించారు.
Recommended Video

నారాయణ స్వామి సవాల్..
టీడీపీ సభ్యుల ఆందోళనతో పది మంది టీడీపీ ఎమ్మెల్యేలను ఈ రోజు సమావేశాల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు తీర్మానం ప్రతిపాదించారు. సభ తీర్మానం ఆమోదించటంతో.. సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. సభలో ఈ రోజు పలు శాఖల బడ్జెట్ డిమాండ్లపై చర్చించనున్నారు. సాంఘిక, గిరిజన, బీసీ, మహిళ, శిశు, మైనారిటీ సంక్షేమం, గృహనిర్మాణ శాఖల పద్దులపై అసెంబ్లీ చర్చించనుంది. రేపు సభలో జంగారెడ్డి గూడెం అంశం పైన సభలో ప్రభుత్వం చర్చ చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications