కాకినాడ, తిరుపతి, సికింద్రాబాద్ ప్రజలకు ముఖ్య సూచన
సంక్రాంతి పండగ అనగానే రైళ్లు, బస్సులు కిక్కిరిసి ఉంటాయి. వీటిల్లో ప్రయాణించాలంటే ఎంతో సాహసం చేయాల్సి ఉంటుంది. జీవితంలో ఇలాంటివి మధురమైన అనుభవాలుగా మిగిలిపోతాయి. మరో మధురమైన అనుభవం పొందడానికి త్వరలోనే సంక్రాంతి పండగ రాబోతోంది. సంక్రాంతికి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఇప్పటికే 32 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వీటికి అదనంగా మరో ఐదు రైళ్లను ప్రకటించారు. సికింద్రాబాద్-తిరుపతి, సికింద్రాబాద్-కాకినాడ, కాకినాడ-తిరుపతి మధ్య ఈనెల 10, 11, 12, 13 తేదీల్లో ప్రయాణిస్తాయి.
జనవరి 10న నెంబర్ 07065 సికింద్రాబాద్-తిరుపతి మధ్య ఉంటుంది.
జనవరి 11న నెంబర్ 07066 సికింద్రాబాద్-కాకినాడ టౌన్ మధ్య ఉంటుంది.
జనవరి 12న నెంబర్ 07250 సికింద్రాబాద్-కాకినాడ టౌన్ మధ్య ఉంటుంది.
జనవరి 12న నెంబర్ 07067 కాకినాడ టౌన్-సికింద్రాబాద్ మధ్య ఉంటుంది.
జనవరి 13న నెంబర్ 07249 కాకినాడ టౌన్-తిరుపతి మధ్య ఉంటుంది.

ఈ రైళ్లకు సంబంధించి టికెట్లు, టైమింగ్స్ వివరాలన్నీ IRCTC సైట్‌లో లభిస్తాయి. అయితే ఈ ప్రత్యేక రైళ్లు ఎక్కాలంటే చాలా తలనొప్పిగా ఉంటోందని ప్రయాణికులు అంటున్నారు. స్పెషల్ ట్రైన్స్ పేరుతో ప్రతిరోజు నడిచే మెయిల్, ఎక్స్ ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లకన్నా చాలా ఎక్కువగా ఛార్జీలు వసూలు చేస్తున్నారని, అంతేకాకుండా ఈ రైళ్లు ప్రయాణం చేస్తున్న సమయంలో క్రాసింగ్ పేరుతో పక్కన పడేస్తున్నారని, ఇతర రైళ్లన్నీ వెళ్లిపోయిన తర్వాత వీటిని పంపిస్తున్నారని, అదనపు ఛార్జీలు వసూలుచేస్తూ ఇతర రైళ్లకన్నా ఎంతో సౌకర్యవంతంగా, ఎంతో తొందరగా గమ్యస్థానం చేరాలని, కానీ అందుకు విరుద్ధంగా నడుస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈసారి అటువంటిదేమీ జరగదని, సమయం ప్రకారమే నడిపిస్తామని అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications