తిరుమలలో నేడు అక్టోబర్ నెల స్పెషల్ దర్శనం టికెట్లు విడుదల..
తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు శుభవార్త.. తిరుమలలో నేడు (జులై 24) అక్టోబర్ నెల స్పెషల్ దర్శనం టిక్కెట్లు విడుదల కానున్నాయి. నేటి ఉదయం 10 గంటలకే అక్టోబర్ నెలకు సంబంధించిన 300 రూపాయల స్పెషల్ ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేయనునట్లు తెలిపింది. వీటితోపాటు తిరుమల శ్రీవారి సన్నిధిలో అక్టోబరు నెల గదుల కోటాను నేటి మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. ఇక, ఈనెల 27వ తేదిన తిరుమల - తిరుపతి స్వామివారి సేవ కోటా ఉదయం 11 గంటలకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ మధ్యాహ్నం 1 గంటకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
నేడు తిరుమలలో పల్లవోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో పాటు ఆలయంలో నేడు మైసూరు మహారాజు జయంతి సందర్భంగా కర్ణాటక చౌల్ట్రీ దగ్గర ప్రత్యేక పూజలను నిర్వహించనున్నట్లు టీటీడీ పేర్కొంది. ఇక, వీటితోపాటు ఉదయం పది గంటలకు స్పెషల్ దర్శనం టికెట్లు, పదకొండుగంటలకు స్వామివారి సేవ కోటా, పన్నెండు గంటలకు పరకామణిసేవ కోటా విడుదల చేయనున్నారు.

భక్తులు ఇతర పూర్తి సమాచారంతో పాటు స్వామివారి అర్జిత సేవ, ప్రత్యేక దర్శనం టిక్కెట్లను బుక్ చేసుకునేందుకు టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ను https://ttdevasthanams.ap.gov.in సంప్రదించగలరు. ఇక, ఆలయంలో అక్టోబర్ 4వ తేది నుంచి 12వ తేది వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. అందుకే అక్టోబర్ 4 నుంచి 10వ తేదీ వరకు సుప్రభాత సేవతో పాటు మిగిలిన అన్ని ఆర్జిత సేవలను రద్దు చేయనున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు.
సర్వదర్శనానికి 8గంటలు..
తిరుమల స్వామివారి దర్శనానికి భక్తుల రద్దీ నెలకొంది. దర్శనానికి 10 కంపార్టుమెంట్లలో భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. ఇక, టోకెన్ లేని శ్రీవారి భక్తులకు సర్వ దర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతున్నట్లు అధికారులు తెలిపారు. నిన్న ఒక్కరోజే స్వామివారిని దర్శించుకునేందుకు 73, 332 మంది భక్తులు వచ్చారు. ఇందులో 25, 202 మంది భక్తులు తలనీలాలు సమర్పించి స్వామివారికి తమ మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న ఒక్కరోజే స్వామివారి హుండీ ఆదాయం రూ. 3.73 కోట్ల వచ్చినట్లు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications