విశాఖకు రైల్వే జోన్, టీ కనెక్టివిటిపై బాబు వద్దకు..
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైల్వే జోన్ ఏర్పాటుపై కసరత్తు వేగవంతమవుతోంది. కేంద్ర రైల్వే బృందం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో గురువారం భేటీ అయింది. ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు పైన చర్చించింది. జోన్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయ సహకారాలు, జోన్ ఏర్పాటుతో కలిగే లాభ నష్టాలపై చర్చించారు.
విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటినుంచో విజ్ఞప్తి చేస్తోంది. జోన్‌లో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లను కలపాలన్న ప్రతిపాదన ఉంది. దీని పైనే ఎక్కువగా గురువారం చర్చ జరిగింది. రైల్వే బోర్డు ప్లానింగ్ విభాగం ఈడి దేవేందర్ సింగ్ కన్వీనర్‌గా, అలోక్ కుమార్, విజయకుమార్, ఎన్‌ఎస్ యూకే, ఎస్‌కె గుప్తా, ఎసి రాయ్, ఎస్‌పి సమంత్ రే వంటి అధికారులతో కేంద్రం ఇటీవల కమిటీ ఏర్పాటు చేసింది.

జోన్ ఏర్పాటు అంశాన్ని కమిటీ అధ్యయనం చేస్తోంది. గురువారం కమిటీ ప్రతినిధులు చంద్రబాబును కలిసి, ప్రభుత్వ అభిప్రాయాలను తెలుసుకున్నారు. విశాఖ కేంద్రంగా జోన్ ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాంత ప్రయాణికులకు, నిరుద్యోగులకు మేలు కలుగుతుందని, సర్వతోముఖాభివృద్ధికి జోన్ దోహదపడుతుందని అధికారులు కేంద్ర బృందానికి వివరించినట్టు సమాచారం.
ఇదే సమయంలో రాష్ట్రంలో రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు, కొత్త రాజధాని నుంచి హైదరాబాద్‌కు, ఇతర తెలంగాణ ముఖ్య నగరాలకు ర్యాపిడ్ రైలు, రోడ్డు కనెక్టివిటీ ఏర్పాటు చేసే అంశాలపై కమిటీ ప్రభుత్వ అభిప్రాయాలు అడిగి తెలుసుకుంది. ప్రత్యేక జోన్ ఏర్పాటు అంశంపై సానుకూలంగానే స్పందించిన కమిటీ తుది నివేదిక ఇవ్వాల్సి ఉంది.












Click it and Unblock the Notifications