ప్రత్యేక హోదాపై భగ్గు: పల్లె సర్దుబాటు మాట
న్యూఢిల్లీ/ హైదరాబాద్/ కడప: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదనే వార్తలు తీవ్ర ఆందోళనకు దారి తీస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఆందోళనలకు శ్రీకారం చుడుతున్నాయి. అధికార తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా రగిలిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఐడీయల్ దళిత్ ఉమెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళలు ఢిల్లీలోని జంతర్‌మంతర్ దగ్గర సోమవారం ధర్నా చేశారు. గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన మహిళలు ఈ ధర్నాలో పాల్గొన్నారు. కేంద్రం ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని ఐడీయల్ దళిత్ ఉమెన్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు రాజసుందరం డిమాండ్ చేశారు.

ఇదిలావుంటే, కడప కలెక్టర్ కార్యాలయం వద్ద స్వయంగా అధికార తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ధర్నాకు దిగారు. ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని వారు డిమాండ్ చేశారు.
కాగా, ప్రత్యేక హోదాపై ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించే హక్కు కాంగ్రెస్‌కు లేదని మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా లేకపోయినా రాయితీలు వస్తాయని ఆయన సోమవారం హైదరాబాదులో అన్నారు. చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం తన వంతు ప్రయత్నం చేస్తున్నారన్నారు. తాము ఎవరికీ బానిసలం కాదని మంత్రి స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications