TTD: స్వర్ణ రథంపై దేవదేవుడు - భారీగా భక్తుల రద్దీ..!!
Tirumala: తిరుమలలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీవారి వాహన సేవల్లో పాల్గొనేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. మూడు లక్షల మంది భక్తులు గరుడ సేవకు హాజరయ్యారు. ఉత్సవాల్లో భాగంగా శ్రీ మలయప్పస్వామివారు గజవాహనంపై దర్శనమిచ్చారు. నేడు శ్రీవారి రెండు వాహన సేవలు కొనసాగనున్నాయి.
గజవాహనం పై దర్శనం
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు శ్రీ మలయప్పస్వామివారు గజవాహనంపై దర్శనమిచ్చారు. మాడ వీధుల్లో అంగరంగ వైభవంగా జరిగిన వాహనసేవలో వివిధ కళాబృందాల ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని వాహనసేవలో దర్శించుకున్నారు. నిద్ర లేవగానే ఐశ్వర్యానికి ప్రతీక అయిన ఏనుగును దర్శించడం వల్ల భోగభాగ్యాలు అభివృద్ధి అవుతాయి. మంగళకరమైన గజరాజుకు అతిశయమైన మంగళత్వం కలిగించేందుకు శ్రీవారు ఆరో రోజు తన సార్వభౌమత్వాన్ని భక్తులకు తెలిపేందుకు గజవాహనంపై ఊరేగుతాడు.

భక్తులకు అనుగ్రహం
ఏనుగు ఓంకారానికీ, విశ్వానికీ సంకేతం. స్వామి ప్రణవరూపుడు, విశ్వాకారుడూ, విశ్వాధారుడూ కనుక గజరాజుపై ఊరేగడం ఎంతో సముచితం. ఈ ఉత్సవం మనలోని అహంకారం తొలగితే మనపై రక్షకుడుగా భగవంతుడుంటాడనే సంగతి గుర్తు చేస్తుంది. శ్రీవారి ఆలయ గజాలు లక్ష్మీ, మహాలక్ష్మి, పద్మజ, పద్మావతి నేతృత్వంలో మలయప్ప వాహన సేవల వైభవాన్ని పెంచింది.
రంగురంగుల అలంకారాలతో గజవాహనం ముందు శరవేగంగా కదులుతూ భక్తులకు కనువిందు చేశాయి. బుధవారం సాయంత్రం 4 గంటలకు శ్రీవారు బంగారు తేరులో పయనిస్తూ, భక్తుల్ని తన కృపాకటాక్షాలతో అనుగ్రహించారు.
నేటి వాహన సేవలు
దాసభక్తుల నృత్యాలతోను, భజనబృందాల కోలాహలం, మంగళ వాయిద్యాల నడుమ తిరు మాడవీధులలో కడురమణీయంగా స్వర్ణరథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీవారి స్వర్ణ రథాన్ని లాగారు. స్వర్ణరథోత్సవాన్ని దర్శించడంవల్ల- లక్ష్మీదేవి కరుణతో సంపదలు, భోగభాగ్యాలూ; భూదేవి కరుణతో, సమస్తధాన్యాలూ, శ్రీవారికరుణతో సర్వశుభాలూ, సుఖాలూ చేకూరుతాయని భక్తుల విశ్వాసం. ఈ రోజు అక్టోబరు 10(గురువారం) - సూర్యప్రభ వాహనం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, చంద్రప్రభ వాహనం రాత్రి 7 నుంచి 9 గంటల వరకు నిర్వహించనున్నారు.












Click it and Unblock the Notifications